హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాను అమ్ముడుబోయానన్న ఆరోపణలపై కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం స్పందించారు. చెన్నై-కొల్కతా హైవేపై లక్షలమంది కార్యకర్తలతో కలిసి బైఠాయించిన ఆయన ఒక వాహనంపై కూర్చుని మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు తమ సామాజివర్గాన్ని బీసీల్లో చేర్చాలని, వేయికోట్లతో తమకు నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తాము ఏ కులానికిగానీ, పార్టీకిగానీ వ్యతిరేకమో, అనుకూలమో కాదని చెప్పారు. వైసీపీకి తాను అమ్ముడైపోయినట్లు కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని, తానుగానీ, తన కులంగానీ ఏనాడైనా అమ్ముడుపోయిందా చంద్రబాబు నాయుడుగారూ అని ప్రశ్నించారు. ప్రభుత్వంతో అటో, ఇటో తేల్చుకునేదాకా ఇళ్ళకు వెళ్ళే సమస్యే లేదని అన్నారు.