ఇటీవల మీడియాలో తుని విద్వంసంపై సి.ఐ.డి. దర్యాప్తు వేగవంతం అయ్యిందని వార్తలు వచ్చేయి. విద్వంసం జరిగిన రెండు రోజులలో స్థానిక సెల్ టవర్ల నుంచి వెళ్ళిన ఫోన్ కాల్స్ డాటా, కొందరు స్థానికులు అందజేసిన వీడియో క్లిప్పింగుల ఆధారంగా ఆ విద్వంసానికి పాల్పడినవారిని, వారి వెనుక బడా నేతలని గుర్తించడానికి సి.ఐ.డి. పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేసారని వార్తలు వచ్చేయి.
ఆ వార్తలపై ముద్రగడ పద్మనాభం స్పందిస్తూ “పేపర్లలో అటువంటి వార్తలు వ్రాయించినంత మాత్రాన్న నేను భయపడిపోను. నేను కాపులకు రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఉద్యమానికి మాత్రమే నాయకుడిని తప్ప తుని విద్వంసానికి కాదు. కనుక ప్రభుత్వం నన్ను భయపెట్టే ఆలోచన మానుకొంటే మంచిది. ఒకవేళ సి.ఐ.డి. పోలీసులు అవసరమనుకొంటే నన్ను కూడా విచారించవచ్చు. నేను ఎప్పుడూ వారికి అందుబాటులోనే ఉంటాను. ప్రభుత్వం తన హామీలను నిలబెట్టుకోనందునే నేను ఉద్యమించవలసి వచ్చింది. నేను ఉద్యమించబట్టే కాపులకు ఆ మాత్రం న్యాయం జరిగింది. కనుక ప్రభుత్వం మాట తప్పితే మళ్ళీ నేను రోడ్డెక్కడం ఖాయం. ఇకనయినా ప్రభుత్వం చిత్తశుద్ధితో కాపుల సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుంది,” అని అన్నారు.
ఇదే సమయంలో రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల రాజప్ప కూడా తుని ఘటనలపై మాట్లాడటం యాదృచ్చికం కాదని భావించవచ్చు. ఆయన నిన్న గుంటూరులో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ “ప్రాధమిక విచారణలో తుని ఘటనల వెనుక రౌడీ షీటర్లు ఉన్నట్లు సి.ఐ.డి. పోలీసులు గుర్తించారు. వారు తమ నివేదిక ఇవ్వగానే దోషులపై చర్యలు చేపడతాము. ఎంత పెద్దవారయినా విడిచిపెట్టే ప్రసక్తే లేదు,” అని అన్నారు.
ఈ కేసులో విద్వంసానికి పాల్పడిన వారిని శిక్షించడం కంటే రాజకీయాలే ఎక్కువగా కనబడుతున్నాయి. అవేమిటో ముద్రగడ స్పందన చూస్తే అర్ధమవుతోంది.