ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ముద్రగడ పద్మనాభం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. అయితే పైకి అలాగా కనిపిస్తున్నా తెదేపా, వైకాపాల మధ్య ఆయన నలిగిపోతున్నారని చెప్పవచ్చును. ఆయనను వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డే రెచ్చగొట్టి ప్రభుత్వం పైకి ఉసిగొల్పుతున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తుంటే, ఆవిధంగా ఆయన పట్ల అనుచితంగా మాట్లాడుతూ కాపులని, వారి కోసం పోరాడుతున్న ఆయనని ప్రభుత్వం అవమానిస్తోందని వైకాపా నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. కానీ తెదేపా చేస్తున్న ఆ ఆరోపణలకి భయపడో లేకపోతే తమ పార్టీకి బీసీలను దూరమవుతారనే భయంతోనో వైకాపా ఆయనకు ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వలేకపోతోంది. ఆ కారణంగానే తెదేపా నేతలు ఆయనపై విమర్శలు గుప్పించగలుగుతున్నారు.
జగన్ ప్రోద్భలంతోనే ఆయన కాపులకు రిజర్వేషన్ల అంశాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణలను ఆయన గట్టిగానే త్రిప్పి కొడుతున్నారు. కానీ ఆయనకు మద్దతుగా కాపు నేతలు ఎవరూ మాట్లాడటానికి ముందుకు రాకపోవడం గమనార్హం. అంటే వారు కూడా ఆయన రాజకీయ దుర్దేశ్యంతోనే ప్రభుత్వంపై పోరాటం మొదలుపెట్టారని భావిస్తున్నట్లున్నారని అనుకోవలసి ఉంటుంది. లేకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా నేతలు అందరూ తమ నాయకుడిపై అంత తీవ్రమయిన విమర్శలు చేస్తుంటే వారు చూస్తూ ఊరుకోరు కదా?
కాపుల కోసం పోరాడుతున్నామని చెప్పుకొంటున్న ముద్రగడకి అటు తన కాపు కులస్థుల నుండి మద్దతు లభించక, వైకాపా నుంచి కూడా మద్దతు లభించకపోవడంతో ఆయన దేశ ముదురు తెదేపా నేతలతో ఒంటరి పోరాటం చేయవలసి వస్తోంది. జగన్ ప్రోద్భలంతో ముందుకు దూకినందుకు బహుశః ఇప్పటికే ఆయన పశ్చాతప పడుతున్నారేమో కూడా. కానీ ప్రభుత్వానికి మళ్ళీ కొత్త డెడ్ లైన్ ఇచ్చేసినందున వెనుతిరిగే మార్గాన్ని ఆయనే స్వయంగా మూసేసుకొన్నట్లయింది. అలాగని దైర్యం చేసి ముందుకే వెళ్ళినా ఆయనకు ఇబ్బందులు తప్పకపోవచ్చును. ఒకవేళ మళ్ళీ నిరాహార దీక్షకు కూర్చొని దానిని మళ్ళీ అర్దాంతరంగా ముగించినా లేదా పోలీసులే దానిని భగ్నం చేసినా ఆయనే నవ్వులపాలవుతారు.
జగన్ ప్రోద్భలంతోనే ఆయన మళ్ళీ ప్రభుత్వంతో పోరాటానికి సిద్దం అవుతున్నట్లు తెదేపా నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమనుకొంటే, ఒకవైపు తెదేపా నేతల నుండి ఈ రకమయిన విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ముద్రగడపై, మరోపక్క జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా (పోరాటం కొనసాగించమని) తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటూ ఉండి ఉండవచ్చును. ఈ పరిణామాలు చూస్తుంటే ఆయన అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆడుకొంటున్న రాజకీయ చదరంగంలో పావుగా మారిపోయినట్లు కనబడుతున్నారు. తాను ఎవరి కోసం ఉద్యమిస్తున్నారో వారి నమ్మకాన్ని పొంది, వారు తనపై ఉంచిన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేసి ఉండి ఉంటే, ఆయనకి ఇటువంటి పరిస్థితి ఎదురయ్యేది కాదని చెప్పవచ్చును.