కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ముద్రగడ పద్మనాభం తునిలో ప్రారంభించిన కాపు ఐక్య గర్జన సభ హిమాసాయుతంగా మారిన సంగతి తెలిసిందే. పరిస్థితులు అదుపు తప్పడంతో ఆయన రాస్తా రోకో పిలుపుని కొద్ది సేపటి క్రితం ఉపసంహరించుకోవడంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల పొడవునా నిలిచిపోయిన వాహనాలు మెల్లగా కదలడం మొదలయింది. రేపు సాయంత్రంలోగా కాపులకు రిజర్వేషన్లపై నిర్దిష్టమయిన ప్రకటన చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొంటానని ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గడువు విధించారు.
ఆయన రాస్తా రోకో విరమించుకొన్నప్పటికీ ఇంకా రైల్ రోకో ని కొనసాగిస్తుండటంతో విశాఖ నుండి బయలుదేరవలసిన అనేక రైళ్ళను అధికారులు అక్కడే నిలిపివేశారు. అలాగే విజయవాడ నుంచి విశాఖకు రావలసిన రైళ్ళను కూడా నిలిపివేసి రైల్వే అధికారులు ముద్రగాడ పద్మనాభంతో చర్చలు జరుపుతున్నారు. పరిస్థితులు మళ్ళీ అదుపు తప్పకుండా నియంత్రించేందుకు సుమారు మూడు వేలమంది పోలీసులు తునికి చేరుకొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రులతో అత్యవసరంగా సమావేశమయ్యి తునిలో నెలకొన్న పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తునిలో జరిగిన సంఘటనలు చాలా బాధాకరమని, కాపులకు రిజర్వేషన్లు కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. దాని కోసం ఉద్యమిస్తున్నవారు ఇకనయినా తమ ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేసారు.