తుని విధ్వంసం కేసులో అరెస్టయిన 13మంది విడుదల కోసం గత 13రోజులుగా రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం దంపతులు ఎట్టకేలకు కొద్దిసేపటి క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి తమ స్వగ్రామం కిర్లంపూడికి బయలుదేరారు. ప్రభుత్వమే తమని కిర్లంపూడిలో దింపాలని, అంతవరకు దీక్ష విరమించను..ఆసుపత్రి విడిచి బయటకి వెళ్లనని ముద్రగడ పంతం పట్టారు. కానీ అందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. దానితో మళ్ళీ ప్రతిష్టంభన ఏర్పడింది. కాపు నేతలు ముద్రగడకి నచ్చచెప్పడంతో ఆయన వారి అభ్యర్ధన మన్నించి, వారు ఏర్పాటు చేసిన వాహనంలోనే కొద్ది సేపటి క్రితం కిర్లంపూడికి బయలుదేరారు.
ముద్రగడ దంపతులు ఇంకా తమ నిరాహార దీక్షని కొనసాగించడానికి బలమైన కారణాలు ఏవీ కనిపించడం లేదు కనుక కిర్లంపూడి చేరుకోగానే దీక్ష విరమించే అవకాశం ఉంది.
మొదటిసారి ఆయన దీక్ష చేసినప్పుడు ప్రభుత్వం తరపున మంత్రులు వచ్చి ఆయన కోరిన డిమాండ్లన్నిటికీ ఆమోదించి ఆయన చేత దీక్ష విరమింపజేశారు. ఈసారి ఆయనని పలకరించడానికి ప్రభుత్వం తరపున పోలీస్ అధికారులే తప్ప ఎమ్మెల్యేలు కూడా రాలేదు. అంతేకాదు ఆయనని కిర్లంపూడిలో విడిచిపెట్టేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించలేదు. మొదటిసారికి, ఇప్పటికీ కనిపిస్తున్న ఈ తీవ్ర వ్యత్యాసం గమనిస్తే ఆయన పట్ల ప్రభుత్వ వైఖరిలో చాలా కటినమైన మార్పు వచ్చినట్లు స్పష్టం అవుతోంది. తద్వారా ప్రభుత్వం ఆయనకీ చాలా బలమైన సంకేతాలే పంపినట్లు భావించవచ్చు. కనుక దానిని బట్టే ముద్రగడ పద్మనాభం తన తదుపరి కార్యాచరణని రూపొందించుకోవడం చాలా మంచిది.
ఒకవేళ ఆయన మళ్ళీ ప్రభుత్వంతో పోరాడదలచుకొన్నట్లయితే, రాజకీయాలకి అతీతంగా కాపులని కలుపుకొని, వారితో కలిసి సమిష్టి నిర్ణయం తీసుకొని పోరాడటం మంచిది. లేకుంటే ఇంకా అవమానకరమైన పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు.