రాజకీయ పార్టీలు ఎన్నికలలో గెలిచి అధికారం దక్కించుకొనేందుకు రుణాల మాఫీ, పన్ను బకాయిల మాఫీ వంటి హామీలు ఇస్తుంటాయి. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత అవేవిధంగా వ్యవహరిస్తాయో తెలుసుకొనేందుకు మన ముందు తెదేపా, తెరాస ప్రభుత్వాలున్నాయి. 2014సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆ రెండు పార్టీలు కూడా పంట రుణాలు మొదలుకొన్ని దాదాపు అన్ని రకాల రుణాలను మాఫీ చేసేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చేయి. కానీ ఆ తరువాత ఆ హామీలను నిలబెట్టుకోలేక చాలా ఆపసోపాలు పడి చివరికి ఏదో మోక్కుబడిగా కొంత మేర రుణాలు మాఫీ చేసి చేతులు దులుపుకొన్నాయి. మళ్ళీ గ్రేటర్ ఎన్నికలలో, త్వరలో జరుగబోయే వరంగల్, ఖమ్మం మునిసిపల్ ఎన్నికలలో కూడా ఇంటి పన్ను బకాయిలను మాఫీ చేస్తామని తెరాస హామీ ఇస్తోంది.
ఇటువంటి హామీల వలన రాజకీయ పార్టీలే ప్రజలను పన్నులు, అప్పులు ఎగవేయమని ప్రోత్సహిస్తున్నట్లుంది. ఆ తరువాత అదే పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని నిలబెట్టుకోవడానికి ప్రజలపై ఏదో రూపంలో అదనపు భారం మోపడం సర్వసాధారణం అయిపోయింది. రాజకీయ పార్టీలు అధికారం దక్కించుకోవడం కోసం ఇస్తున్న హామీలకు మళ్ళీ ప్రజల చేతనే మూల్యం చెల్లింపజేస్తున్నాయి తప్ప అవేవీ తమ జేబుల్లో నుండి తీసి ఇవ్వడం లేదనే సంగతి స్పష్టమవుతోంది. అయినా అటువంటి హామీలను ఇవ్వడాన్ని ప్రజలు, న్యాయస్థానాలు, ఎన్నికల కమీషన్ ఎవరూ తప్పుగా భావించక పోవడం విశేషమే. ఇటువంటి హామీలు ఇస్తూ ప్రజలను అవినీతికి ప్రోత్సహిస్తున్న రాజకీయ పార్టీలే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలందరూ చట్టానికి లోబడి ఉండాలని, పన్నులు, బ్యాంక్ రుణాలు సకాలంలో చెల్లించాలని కోరుతుంటాయి.
కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ఉద్యమించిన ముద్రగడ పద్మనాభం ఒత్తిడి మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కాపులకు రుణాలు మంజూరు చేస్తోంది. రుణాలు అంటే ఎంతో కొంత వడ్డీతో నిర్దిష్ట కాలపరిమితిలో తీర్చవలసి ఉంటుందని అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్రాసిన లేఖలో ఆ రుణాల చెల్లింపునకు నిర్దిష్ట కాలపరిమితి విధించవద్దని కోరడం చూస్తే ఆ రుణాలు తిరిగి చెల్లించవలసిన అవసరం లేకుండా చేయమని కోరుతున్నట్లుంది.
ముద్రగడ తనకు వయసు అయిపోయిందని, తను ఏ పార్టీలోను చేరడంలేదని, అధికారంపై ఆసక్తి లేదని చెపుతున్నారు. మరి అటువంటప్పుడు ఆయన కూడా రుణాల మాఫీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారనే సందేహం తప్పక కలుగుతుంది. రాజకీయ నాయకులే ఈ విధంగా ప్రజలను అవినీతికి పాల్పడమని ప్రోత్సహిస్తుంటే, ఇక సమాజంలో అవినీతిని తొలగించడం ఎవరివల్ల సాధ్యం అవుతుంది?