కాపుల నేత ముద్రగడ పద్మనాభం ఈనెల 11 నుంచి మళ్ళీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఈసారి ప్రభుత్వం ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేయకపోవడంతో ఆయన తన దీక్షకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. రేపటి నుండి రెండు రోజుల పాటు ఆయన కాపు సంఘాల నేతలతో తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో సమావేశమయ్యి కార్యాచరణ రూపొందించుకొనున్నారు. ఒకవేళ వారు కిర్లంపూడి చేరుకోవడానికి పోలీసులు అంగీకరించకపోతే, జిల్లాలవారిగా కమిటీలు ఏర్పాటు చేసుకొని జిల్లా స్థాయిలోనే ఎక్కడికక్కడ నిరసన దీక్షలు, ర్యాలీలు నిర్వహించేందుకు యోచిస్తున్నారు. తన దీక్షకు మద్దతు తెలుపడానికి ఎవరూ కిర్లంపూడికి రావద్దని ముద్రగడ పద్మనాభం కాపు నేతలకు, కులస్తులకు విజ్ఞప్తి చేసారు. ఒకవేళ ఎవరయినా తరలివస్తే వారిని అడ్డుకొంటామని రాష్ట్ర హోంమంత్రి చిన రాజప్ప ముందే ప్రకటించారు.
కాపులకు రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయాలని ముద్రగడ పద్మనాభం చూస్తున్నారని, ఆయన జగన్మోహన్ రెడ్డి చేతిలో పావుగా మారి రాజకీయ దురుదేశ్యంతోనే మళ్ళీ దీక్షకు కూర్చొంటున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. కనుక ఈసారి ఆయన దీక్షకు పోలీసుల చేత ముగింపు పలికించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే కనుక జరిగినట్లయితే ఆయన రెండవ ప్రయత్నంలో కూడా విఫలమయినట్లే భావించవలసి ఉంటుంది. ఈసారి ఆయన విఫలమయితే ఆయనపై కాపుల నమ్మకం, విశ్వసనీయత ప్రశ్నార్ధకం అవుతుంది.