ముద్రగడ పద్మనాభం మళ్ళీ రేపటి నుండి ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టేందుకు సిద్దం అవుతున్నారు. ఆయనకి నచ్చజెప్పేందుకు ఈసారి ప్రభుత్వం తరపు నుండి ఎవరూ ప్రయత్నించలేదు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక పోలీస్ ఉన్నతాధికారి ఆయనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు కానీ ప్రభుత్వం తనకు లిఖిత పూర్వకంగా హామీ ఇస్తే తప్ప ఆ ఆలోచన విరమించుకొనే ప్రసక్తే లేదని చెప్పారు. ఆయన కోరినట్లు ప్రభుత్వం చేయడం కుదరదు కనుక ఆయన కిర్లంపూడిలో గల తన నివాసంలో రేపటి నుండి మళ్ళీ ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టబోతున్నారు.
ఇదివరకు ఆయనకు హామీ ఇచ్చిన ప్రకారం కాపు కార్పోరేషన్ కి ఈరోజు బడ్జెట్ లో రూ. 1000 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. కాపులకు రిజర్వేషన్లపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ఏర్పాటు చేయబడిన జస్టిస్ మంజునాధ కమీషన్ తన పని పూర్తి చేయడానికి ఇంకా ఆరేడు నెలలు పడుతుందని ముద్రగడకి ప్రభుత్వం ఇదివరకే చెప్పింది. అప్పుడు ఆయన కూడా అందుకు అంగీకరించారు. ఆయనకిచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తునప్పటికీ మళ్ళీ నిరాహారదీక్షకు సిద్దపడుతుండటం వలన ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రోద్భలంతో రాజకీయ దురుదేశ్యంతోనే చేయబోతున్నట్లు అనుమానించవలసివస్తోంది. కనుక ఈసారి ఆయన పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా కటిన వైఖరి అవలంభించవచ్చును. నాలుగైదురోజులు దీక్ష చేసిన తరువాత పోలీసుల చేత దానిని భగ్నం చేయించే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి.