ఎన్నికల దగ్గరపడుతున్న నేపథ్యంలో కాపులు ఎవరికి మద్దతు ఇవ్వాలనే రాజకీయ నిర్ణయం త్వరలోనే తీసుకుంటామంటున్నారు కాపు జేయేసీ కన్వీనర్ ముద్రగడ పద్మనాభం. దీనికి సంబంధించి డిసెంబర్ నెలలో కాపు జేయేసీ కీలక నిర్ణయం ప్రకటిస్తుందన్నారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే అంశమై ఇప్పటికే పలువురు కాపు సంఘాల నేతలతో చర్చించామని ముద్రగడ అన్నారు. అయితే, రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలూ తమతో ఏదో ఒక విధంగా టచ్ లో ఉన్నాయని అన్నారు.
వచ్చే నెలలో 13 జిల్లాల్లోనూ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నామనీ, జిల్లాలవారీ అక్కడి కాపుల సమస్యల్ని తెలుసుకుని, రాజకీయంగా ఎవరికి మద్దతు ఇవ్వాలనే నిర్ణయం కూడా అక్కడే జరుగుతుందన్నారు. కాపు యువత గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చాలాసార్లు కోరుతున్నా సరైన స్పందన ఉండటం లేదని విమర్శించారు ముద్రగడ! ఇచ్చిన హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రి కోరుతున్నామనీ, అయితే ఇలా అడగడమే నేరం అన్నట్టుగా చూస్తున్నారన్నారు. ప్రస్తుతం అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిన మాట వాస్తవమేగానీ… ఈలోగా కాపుల రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని ఆశించామన్నారు.
కాపు సంఘాల రాజకీయ నిర్ణయం కోసం చర్చలు జరుగుతాయని చెబుతూ, అన్ని పార్టీలూ తమతో చర్చిస్తున్నాయని చెబుతూనే… మరోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలకు దిగుతున్న తీరు గమనార్హం! నిజానికి, కాపుల రిజర్వేషన్ల విషయమై గత ప్రభుత్వాలతో పోల్చితే… టీడీపీ హయాంలోనే కదిలక వచ్చింది. ఒక కమిషన్ ను వేసి, రిజర్వేషన్ల కల్పనపై అధ్యయం చేయించి, అసెంబ్లీ తీర్మానం కూడా చేశారు. అది కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది! టీడీపీపై భాజపా రాజకీయ కక్ష సాధింపు ధోరణిలో ఉందనేదీ తెలిసిందే. ఇక, ప్రతిపక్ష పార్టీ విషయానికొస్తే… కాపుల రిజర్వేషన్లపై ఆ మధ్య జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో, ఆ తరువాత అడ్దంగా నాలిక కరుచుకుని తూచ్ అంటూ ఎలా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారో అందరూ చూసిందే. ఇంకోపక్క, జనసేనాని కూడా అప్పుడప్పుడూ ముద్రగడను కలిశారు. ఏవో సలహాల కోసమే అన్నారు. రిజర్వేషన్లపై టీడీపీ రాష్ట్ర స్థాయిలో చేయాల్సింది చేసింది, జగన్ విమర్శించి మళ్లీ తప్పు దిద్దుకునే ప్రయత్నం చేశారు, సలహాల పేరుతో ముద్రగడకు పవన్ టచ్ లో ఉన్నారు! సో.. కాపు సంఘాల సమావేశాల్లో ఇవే కదా కీలకంగా చర్చకు రావాల్సిన అంశాలు..?