ముద్రగడ పద్మనాభం చాలా రోజుల తర్వాత ఉనికి చాటుకున్నారు. ఏపీ సీఎం జగన్‌కు ఓ లేఖ రాశారు. అయితే ఆయన లేఖ.. తన జాతి కోసం కాదు. పరాయి జాతి కోసం. కామెడీగా ఉన్నా ఇది నిజం. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కాపు సామాజికవర్గం మొత్తం అవమానిస్తూ మాట్లాడారు. ఆయన మాటలపై ముద్రగడ ఏం స్పందిస్తారని సోషల్ మీడియాలో పోస్టులు ఎక్కువగా కనిపించాయి. కానీ ఆయన స్పందించలేదు. స్పందిస్తూ రాసిన లేఖలోనూ… అంబటి రాంబాబు ప్రస్తావన కానీ.. తన కాపు జాతి ప్రస్తావన కానీ… కాపు రిజర్వేషన్ల అంశం కానీ లేదు.
ఆ లేఖలో ఉన్నదల్లా… టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు మద్దతుగా .. విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా జగన్‌కు చేసిన ఫిర్యాదు. అశోక్ గజపతిరాజు గురించి ఇటీవలి కాలంలో విజయసాయిరెడ్డితో పాటు వైసీపీ నేతలు అనుచితంగా మాట్లాడుతున్నారు. లక్షల కోట్ల విలువైన ఆస్తులను దానం చేసిన రాజకుటుంబంగా పేరున్న అశోక్‌పై అవినీతి ఆరోపణలుచేస్తూ జైలుకు పంపుతామని అంటున్నారు. ఇది ముద్రగడ పద్మనాభాన్ని మనస్థాపానికి గురి చేసింది. అశోక్ చాలా మంచి వ్యక్తి అని.. ఆయనను అలా విమర్శించడం తనకు బాదేస్తోందని.. విజయసాయిరెడ్డిని దారిలో పెట్టాలని లేఖలో కోరారు.
ముద్రగడ పద్మనాభం స్పందన ఇప్పుడు.. హాట్ టాపిక్ అవుతోంది. ఆయన టీడీపీ సర్కార్ ఉన్నప్పుడు చేసే ప్రకటనలకు.. పిలుపునిచ్చే ఉద్యమాలకు ..ఇప్పుడు ఆయన చేస్తున్న పనులకు పొంతన లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దారుణంగా కాపులు వంచనకు గురవుతున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నా.. ఆయన మాత్రం.. కాపు సంక్షేమం గురించి లేఖలు రాయడానికి సిద్ధపడటం లేదంటున్నారు.