బంగ్లాదేశ్‌కు ప్రజలు ఎన్నుకున్న ప్రధానిని తరిమేసి.. ముఖ్యసలహాదారు పేరుతో రాజ్యమేలుతున్న మహమ్మద్ యూనస్.. తన వడ్డీ వ్యాపారం తెలివితేటల్ని చూపిస్తున్నారు. బంగ్లాదేశ్ ను పూర్తిగా చైనాకు అంకితం చేస్తున్నారు. షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇచ్చిందన్న కారణంతో.. భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆయన చైనాను నెత్తికెక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలపైనా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు.
మహమ్మద్ యూనస్.. మైక్రో ఫైనాన్స్ వ్యాపారం నుంచి వచ్చారు. ఆయన చాలా మంది జీవితాలను మార్చాలన్న కారణంతో నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది. కానీ ఆయన అసలు వ్యవహారశైలి మాత్రం అశాంతికి కేంద్రంగా ఉంది. దేశంలో చిచ్చు పెట్టడంలో ఆయనది కీలక పాత్ర. ప్రజలతో సంబంధం లేకుండా అధికారాన్ని చెలాయిస్తున్నారు . ఎన్నికలు పెట్టాలన్న ఆలోచన చేయడం లేదు. కానీ బంగ్లాదేశ్ ను మాత్రం ఇండియాకు వ్యతిరేకం చేసి.. పాకిస్తాన్, చైనాలకు సన్నిహితంగా చేస్తున్నారు.
బంగ్లాదేశ్ ను చైనా ఎంత పిండుకోవచ్చో అంత పిండుకుంటుంది. భారత్ పై కుట్రలు చేయడానికి ఎంత సాయం కావాలంటే అంత చేస్తుంది. పాకిస్తాన్ భారత్ లో ఉగ్రవాదాన్ని ఎగదోయడానికి ఎంత చేయాలో అంత సాయం చేస్తుంది. కానీ ఈ రెండు దేశాలు చేసే పనుల వల్ల బంగ్లాదేశ్ లో ఉగ్రవాదం.. అరాచకం పెరుగుతుంది. భారత్ పై కుట్రలు చేస్తే భారత్ కు ఎలా ఎదుర్కోవాలో తెలుసు. కానీ బంగ్లాదేశ్ కు మాత్రం మిత్రులు అనే వాళ్లు లేకుండా పోతారు. యూనస్.. 80 ఏళ్లు దాటిన వయసులో ప్రజలతో సంబంధం లేకుండా.. దేశాన్ని నడపాలన్న దురుద్దేశంతో ఆ దేశానికి పెద్ద గండం తెచ్చి పెడుతున్నారు.