హైదరాబాద్: దేశంలో అత్యంత ధనవంతుడిగా వరసగా తొమ్మిదో సంవత్సరంకూడా ముకేష్ అంబానీయే నిలిచారు. వందమంది భారతీయ టాప్ బిలియనీర్ల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. రు.1,25,222 కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ అగ్రస్థానం కైవసం చేసుకున్నారు. ఈ ఏడాది స్టాక్ మార్కెట్లో రిలయన్స్ సంస్థ రు.31 వేల కోట్ల సంపదను పోగొట్టుకున్నా అగ్రస్థానంలో నిలబడటం విశేషం.
మరోవైపు రు.1,19,259 కోట్లతో సన్ ఫార్మా అధినేత దిలీప్ సింఘ్వీ, రు.1,05,345 కోట్లతో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీ 2,3 స్థానాలలో ఉన్నారు. ఇక ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకులు సచిన్, బిన్నీ బన్సల్ మొదటిసారిగా ఈ జాబితాలో చోటు సంపాదించుకోవటం విశేషం. జాబితాలోని వందమంది సంపద కలిసి రు.22,85,797 కోట్లు. అయితే ఇది గత సంవత్సరంకంటే దాదాపు వందకోట్ల రూపాయలు తక్కువ. గత ఏడాదికాలంగా మార్కెట్ల పతనం, రూపాయి విలువ తగ్గటంతో ఈ జాబితాలోని వందమంది ధనవంతుల సంపద కొంతమేర కరిగిపోయిందని విశ్లేషించింది. భారత ఆర్థికవ్యవస్థ 7 శాతం వృద్ధిరేటుతో ముందుకెళుతోందని ఫోర్బ్స్ పేర్కొంది.