రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. కుమారుడు అనంత్ అంబానీ, రిలయన్స్ వైస్ ప్రెసిడెంట్ , రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వానీతో కలిసి వచ్చిన ముఖేష్ అంబానీ..జగన్‌తో రెండు గంటల పాటు సమావేశమయ్యారు. పరిమల్ నత్వానీ ప్రస్తుతం జార్ఘండ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పదవి కాలం.. ముగిసిపోతోంది. దీంతో.. ఏపీ నుంచి వైసీపీ తరపున రాజ్యసభకు పరిమల్ నత్వానీని పంపించబోతున్నారన్న చర్చ ఊపందుకుంది. మరో వైపు పరిమల్ నత్వానీకి రాజ్యసభతో పాటు… ఏపీలో రిలయన్స్‌కు సంబంధించి పెట్టాలనుకున్న పెట్టుబడులపై చర్చించినట్లుగా తెలుస్తోంది. తిరుపతిలో రూ. పదిహేను వేల కోట్ల వ్యయంతో జియో ఫోన్ల తయారీని చేపట్టాలనుకున్నారు. అయితే.. ప్రస్తుత ప్రభుత్వం ఆ భూమిని వెనక్కి తీసుకుని ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలనుకుంది. దాంతో ఈ ప్రాజెక్ట్ నుండి రిలయన్స్ వెనక్కి పోయిందని ప్రచారం జరిగింది.
అయితే.. అదే సమయంలో.. గత ప్రభుత్వంతో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ కాకినాడ సమీపంలో కృష్ణా-గోదావరి బేసిన్లో చమురు, సహజవాయు నిక్షేపాలు వెలికి తీసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ ఒప్పందాన్ని కొనసాగించేందుకు రిలయన్స్ సముఖంగా ఉంది.భారత్ పెట్రోలియం కార్పొరేషన్ భాగస్వామ్యంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో ప్రతిపాదించిన పెట్టుబడులు రూ.37 వేల కోట్లు. సీఎం జగన్ తో ముఖేష్ అంబానీ ప్రధానంగా ఈ ప్రాజెక్ట్ పైనే చర్చించినట్లుగా తెలుస్తోంది. ముకేష్ అంబానీ వెంట ఆయన కుమారుడు అనంత్ అంబానీ.. అలాగే… రిలయన్స్ తరపున ఆయిల్ వ్యాపారాలను చూసే పరిమల్ నత్వానీ అనే వ్యక్తి కూడా ఉన్నారు. ఈయన రాజ్యసభ సభ్యుడు కూడా. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఎలక్ట్రానిక్ సెజ్ విషయంలో కూడా.. సీఎంతో చర్చలు జరిగాయో లేదో.. సమాచారం బయటకు రాలేదు.
గన్నవరంకు ప్రత్యేక విమానంలో వచ్చిన అంబానీలను.. విజయసాయిరెడ్డి అత్యంత గౌరవంగా రిసీవ్ చేసుకున్నారు. ఆయన విమానాశ్రయంలోనే ఓ పెద్ద ప్రతిమను ఇచ్చి శాలువా కప్పి స్వాగతించారు. ఆ తర్వాత తాడేపల్లిలోని ముఖ్యమంత్రి ఇంట్లో… దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖేష్ అంబానీకి మరింత గౌరవం లభించింది. ముగ్గురికి శాలువాలతో పాటు వెండి జ్ఞాపికలను జగన్ అందించారు. వచ్చేటప్పుడు… వెళ్లేటప్పుడు..జగన్ ముఖేష్ బృందానికి సాదర స్వాగతం.. వీడ్కోలు పలికారు. ముఖేష్ అంబానీ రాక చాలా గోప్యంగా ఉంచారు. గతంలో.. వైఎస్‌ను హెలికాఫ్టర్ ప్రమాదం పేరుతో చంపించింది.. ముఖేష్ అంబానీనేనని.. మన గ్యాస్ దోచుకుపోతూంటే.. వైఎస్ అడ్డుకున్నారని..ఈ పని చేశారని జగన్ ఆరోపించారు. రియలన్స్ – రామోజీరావు- చంద్రబాబును కలిపి సాక్షిపై ఎన్నో కథనాలు రాశారు. రిలయన్స్ పై .. దాడులు కూడా చేశారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు.. రిలయన్స్‌లో ఓ కీలక వ్యక్తిగా ఉన్న పరిమల్ నత్వానీని వైసీపీనే రాజ్యసభకు పంపబోతోందన్న ప్రచారం జరుగడం.. ఆశ్చర్యకరమే మరి..!