బిగ్ బాస్ వల్ల ఎవరికి ప్రయోజనం? అనేది పక్కన పెడితే, షోలో పాల్గొన్న సెలబ్రెటీలంతా, కాస్తో కూస్తో సంపాదించుకోగలుగుతున్నారు. వాళ్లకు ఇప్పుడు బుల్లితెర, వెండి తెర రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. సోహైల్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడంటే, దానికి బిగ్ బాస్ నే కారణం. అభిజిత్ రెండో ఇన్నింగ్స్ కి సైతం.. మార్గం సుగమం అయ్యింది. ఇప్పుడు ముక్కు అవినాష్ పంట కూడా పండబోతోంది.
బిగ్ బాస్ 4 సీజన్లో మంచి ఎంటర్టైన్ పంచింది ఎవరంటే.. ముక్కు అవినాష్ పేరే చెబుతారు. జబర్ దస్త్ తో పాపులర్ అయిన అవినాష్, ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడా రాణించాడు. బిగ్ బాస్ హౌస్ ద్వారా.. అవినాష్ బాగానే సంపాదించాడు. బయటకు వచ్చాక కూడా ఆ పాపులారిటీని క్యాష్ చేసుకోగలుగుతున్నాడు. ఈమధ్యకాలంలో అవినాష్ 4 సినిమాల్ని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. `మా` టీవీలో ఓ కామెడీ షో చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాడట. ఆ షో సక్సెస్ అయితే.. అవినాష్ నిలబడిపోయినట్టే. `జబర్దస్త్` తో చేసుకున్న ఒప్పందాల్ని పక్కన పెట్టి `బిగ్ బాస్` షోలో పాల్గొనడానికి అవినాష్ 10 లక్షల రిస్క్ చేసినట్టు తెలుస్తోంది. దానికి రెండింతలు… బిగ్ బాస్ షో ద్వారా సంపాదించాడు. ఇప్పుడు ఓ కామెడీ షోతో పాటు, నాలుగు సినిమాలొచ్చాయి. ఇంకేం కావాలి..?