రాజకీయ పార్టీలు కేవలం ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చేందుకే చేతులు కలిపినా సిద్దాంతాలు, అభివృద్ధి, తోటకూర అంటూ ఏవేవో చెపుతుంటాయి. కానీ వాటిలో ఇచ్చిపుచ్చుకొనే ధోరణి ఉన్నంత కాలం వాటి బంధం తెదేపా-బీజేపీలాగ బలంగానే ఉంటుంది లేకుంటే బీహార్ లో జనతా పరివార్ అవుతుంది.
త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగయినా గెలిచి అక్కడ కూడా బీజేపీ జెండా ఎగురవేయాలని మోడీ, అమిత్ షాలు పావులు కడుపుతుండటం చూసి కంగారుపడిన అధికార జెడియు, జనతా తోకలున్న మరో ఐదు పార్టీలన్నిటినీ కలుపుకొని జనతా పరివార్ అనే కప్పల తక్కెడని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పేరుకి జాతీయ పార్టీయే అయినప్పటికీ ఇప్పుడు ఎక్కడా స్వతంత్రంగా పోటీచేసి గెలిచే పరిస్థితి లేదు కనుక అది కూడా జనతా పరివార్ తో జత కట్టింది. ఆ కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తమనే అంగీకరించాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కొన్ని రోజులు గొడవపడ్డారు. నిజానికి అప్పుడే ఆ కప్పల తక్కెడలో నుండి నితీష్ కుమార్ బయటకు దూకేస్తున్నట్లు ప్రకటించారు. కానీ మధ్యలో రాహుల్ గాంధీ రాయబారం చేసి చివరిని నితీష్ కుమార్ పేరును ఆమోదింపజేయడంతో అప్పటికి ఆ గండం అలా గడిచిపోయింది.
తరువాత సీట్ల సర్దుబాటుపై మళ్ళీ కప్పలు బెకబెకలాడుకొన్నాయి. చివరికి నితీష్ కుమార్, లాలూ ఇద్దరూ తలో వంద సీట్లు పంచుకొని, కాంగ్రెస్ పార్టీకి ఓ 40 సీట్లు పడేసి, మరో 3 సీట్లు శరద్ యాదవ్ పార్టీకి పడేసి చేతులు దులుపుకొన్నారు. అయితే ఈ కప్పల తక్కెడని పట్టుకొనున్న సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ కి అందులో వాటా పంచడం మరిచిపోయారు. ఇన్ని కప్పలని ఒక్క చోట చేర్చి తక్కెడలో నుండి బయటకి గెంతిపోకుండా కాపాడుకొంటూ వస్తున్న తనకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా నితీషు, లాలూ కలిసి అన్ని సీట్లు పంచేసుకొన్నందుకు ములాయంకి చాలా కోపం వచ్చేసింది. అందుకే ఆయన ఆ కప్పల తక్కెడని పక్కన పడేసి తన దారి తను చూసుకొంటున్నట్లు ప్రకటించేశారు. బీహార్ ఎన్నికలలో తన పార్టీ అన్ని సీట్లకు ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించేశారు.
దానిపై నితీషు, లాలూ ఎలా రియాక్ట్ అయ్యారో తెలియదు కానీ మోడీ, అమిత్ షా మాత్రం తప్పకుండా మిఠాయిలు పంచుకొనే ఉంటారు. ఒకసారి కప్పలు చెల్లాచెదురయిపోతే ఇక బీహార్ ఎన్నికలలో అవలీలగా గెలిచేయోచ్చనే ధీమా వారికి ఉంది. పైగా ఈ మధ్యనే బీహార్ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ మోడీ రూ.1.65 లక్షల కోట్ల తాయిలం ప్రకటించారు. ఒకవేళ కప్పలు చెదిరిపోతే కాంగ్రెస్ పార్టీ కూడా నష్టపోతుంది కనుక మళ్ళీ రాహుల్ గాంధీ ఆ యాదవుల మద్య శ్రీకృష్ణ రాయబారం చేస్తారేమో? ఒకవేళ ఈ గండం కూడా ఎలాగో గట్టెక్కినా, ఏ నియోజక వర్గం ఎవరికీ? అనే పాయింటుతో మళ్ళీ కప్పలు బెకబెకమనక తప్పవు.