చిత్రసీమలో అదృష్టానికే పెద్ద పీట. ప్రతిభ ఉన్నా – అదృష్టం కలసి రావాల్సిందే. అదుంటే సత్తునాణెం కూడా బంగారు బిళ్లలా మెరిసిపోతుంటుంది. రాత్రికి రాత్రే స్టార్ డమ్ తిరగ బడుతుంది. ఓడిపోయిన చోట… గెలవడం, గెలిచినవాళ్లు తాము ఇది వరకు ఓడించిన వాళ్ల ముందే చేతులు కట్టుకుని నిలబడడం ఎంతసేపు?? ప్రతి కుక్కకూ ఓ రోజు వస్తుందో, రాదో తెలీదు గానీ.. ప్రతి మనిషికీ తమదంటూ ఓ రోజు వస్తుంది. వచ్చి తీరుతుంది. `మీరు సినిమాలకు పనికి రారు..` అని రిజెక్ట్ చేసినవాళ్ల ముందే సూపర్ స్టార్లుగా ఎదిగి, తమ కసి తీర్చుకునే రోజు కోసం ఎదురు చూసి, తమదైన రోజున ప్రతీకారం తీర్చుకోవడం – సినిమా వాళ్ల జీవితాల్లో మామూలే. అలాంటి అరుదైన ఘటన… ముళ్లపూడి వెంకట రమణ జీవితంలో ఎదురైంది. దాని పూర్వాపరాల్లోకి వెళ్తే…
ఆదూర్తి సుబ్బారావు ‘తేనె మనసులు’ తీస్తున్న రోజులవి. ఆ సినిమాలో అంతా కొత్తవాళ్లే. కృష్ణను ఆల్రెడీ హీరోగా ఎంపిక చేశారు. ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లు కావాలి. వాళ్ల కోసం ఆడిషన్స్ మొదలయ్యాయి. హీరోయిన్లని వెదికి పట్టుకోవాల్సిన బాధ్యతని ముళ్లపూడి వెంకటరమణ, ఆత్రేయ, కె.విశ్వనాథ్ లకు అప్పగించారు ఆదూర్తి. వందల మంది ఆఫీసు ముందు క్యూలు కట్టారు. వాళ్లలో ఎవరూ ఈ త్రయానికి నచ్చడం లేదు. అప్పటి ఆడిషన్స్‌కి వచ్చినవాళ్లలో జయలలిత ఒకరు. ”నువ్వు సినిమాలకు అస్సలు పనికిరావు…” అంటూ ఈ ముగ్గురూ స్టాంపేసి బయటకు పంపేశారు. వీరి తిరస్కరణకు గురైన వాళ్లలో.. హేమామాలిని కూడా ఉన్నారు. చివరికి సుకన్య, సంధ్యారాణి అనే ఇద్దరు తెలుగుమ్మాయిల్ని ఎంచుకున్నారు. తేనె మనసులు విడుదలై, సూపర్ హిట్టయ్యింది. కృష్ణకు మంచి పేరొచ్చింది. కానీ.. సంధ్యారాణి, సుకన్యలను ఎవరూ పట్టించుకోలేదు. కానీ.. ముళ్లపూడి. ఆత్రేయ, విశ్వనాథ్.. రిజెక్ట్ చేసిన జయలలిత, హేమా మాలిని మాత్రం.. ఈ ముగ్గురూ చూస్తుండగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, స్టార్లుగా మారిపోవడం జరిగిపోయాయి. జయలలిత, హేమామాలిని గురించి ఎప్పుడు తలచుకున్నా.. ”మనం ఆరోజు వీళ్లని ఎంపిక చేసి ఉంటేనా?” అనే బాధ మాత్రం ఈ ముగ్గురినీ వెంటాడేది. కొన్నాళ్లకు ఈ టాప్ హీరోయిన్లకు రివైంజ్ తీర్చుకునే టైమ్ వచ్చింది.
బాపు – రమణ ద్వయం హిందీలోనూ కొన్ని సినిమాలు తీశారు. అక్కడా వాళ్లకు మంచి పేరుంది. ఓసారి తాము రాసుకున్న కథలో హీరోయిన్ పాత్ర కోసం హేమామాలినిని ఎంచుకోవాలనుకున్నారు. ఆమెకు కథ చెప్పి, కాల్షీట్లు సంపాదించాలని బాపు – రమణ ఇద్దరూ బొంబాయి బయల్దేరారు. కానీ రమణ మనసులో ఒకటే అనుమానం. ”ఆరోజు నేను తనని రిజెక్ట్ చేశాను కదా. అది మనసులో పెట్టుకుని ఈ సినిమా ఒప్పుకోదేమో” అని లోలోపల ఒకటే తర్జన భర్జనలు పడిపోయారు. మొత్తానికి కథ చెప్పేందుకు అపాయింట్మెంట్ దొరికింది బాపు రమణలకు. ”కథ చెప్పడానికి ఎంత టైమ్ కావాలి” అని అడిగింది హేమామాలిని వచ్చీరావడంతోనే. `ఓ గంట సరిపోతుంది` అన్నారు రమణ. ”అరగంట ఇస్తానంతే. ఆ తరవాత కూడా వినాలనిపిస్తే మరో అరగంట ఇస్తా. నచ్చకపోతే అరగంటకే కథ ఆపాలి..” అని ఆర్డరేసింది.
‘సరే..’ అనుకుని కథ మొదలెట్టారు రమణ. ఇరవై నిమిషాలు గడిచాయో లేదో, ‘ఆపండి..’ అని ఆర్డరేసింది హేమామాలిని. ”ఇది ఓ నవలలోని పాయింటు. దాన్ని అటూ ఇటూ మార్చి కథ రాసేశారు. అదే నాకు చెప్పడానికి వచ్చారు కదూ” అంటూ నిలదీసింది. నిజమే.. అది ఓ నవలకు స్వేచ్చానువాదం. హేమా మాలిని పుస్తక ప్రేమికురాలు. సాహిత్యంమీద చక్కటి అభిరుచి ఉంది. ఆ విషయం తెలియక… ఆమెకు దొరికిపోయారు ఈ ఇద్దరూ. ”సారీ.. ఇలాంటి పాత్ర ఇది వరకే చేశా. ఇప్పుడు చేయలేను. మీరిక వెళ్లొచ్చు” అంటూ సాగనంపింది. `ఈ కథ నచ్చకపోవడం వల్ల చేయడం లేదా? లేదంటే ఇది వరకు ఆమెని ఎంపిక చేయలేదని ఆ కోపాన్ని ఇలా చూపించిందా` అనేది రమణకు ఎంతకీ అర్థం కాలేదు.
కొన్నాళ్లకు అంత కంటే ఘోర పరాభవం జయలలిత ముందు ఎదురైంది. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లిపుస్తకం’ సూపర్ హిట్ అయ్యింది. ఉత్తమ చిత్రంగా నంది అవార్డు గెలుచుకుంది. ఆ యేడు నంది పురస్కారాల ప్రదాన కార్యక్రమం మద్రాస్‌లో నిర్వహించారు. అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథి. ఆమె చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారంతా. ఉత్తమ చిత్రంగా అవార్డు సాధించిన పెళ్లి పుస్తకానికి ముళ్లపూడి వెంకట రమణ నిర్మాత. నంది అవార్డు అందుకోవడానికి ఆయన వేదిక ఎక్కారు. జయలలిత చేతు మీదుగా నంది అందిస్తున్న సమయంలో… అవార్డు ఆమె చేతుల నుంచి జారి, కింద పడబోతోంది. దాన్ని అందుకుని ప్రయత్నంలో రమణ కిందకు వంగారు. జయలలిత కనిపించగానే వంగి ఆమె కాళ్లకు దండాలు పెట్టడం ఎం.ఎల్.ఏలకు. ప్రజా ప్రతినిథులకు, ఆమె అభిమానులకు అలవాటు. రమణ కూడా అలానే దండం పెట్టడానికి వంగారేమో అనుకుని.. ”పెద్దవారు.. మీరు నాకు దండం పెట్టడం ఏమిటండీ” అంటూ జయలలిత పక్కకు జరిగార్ట. దాంతో.. రమణ నిర్థాంత పోయారు. జయలలిత కావాలనే నంది ప్రతిమని కిందకు జార్చారా? కావాలనే.. తనని కాళ్లమీద పడేలా చేశారా? ఇదంతా ఆమె తెలిసి చేశారా, లేదంటే యాదృచ్ఛికంగా జరిగిందా? అనేది రమణకి ఎప్పటికీ అంతు పట్టలేదట. ‘అసలు వీరిద్దరిని అప్పుడే సెలెక్ట్ చేసి ఉంటే.. ఇన్ని అవమానాలూ, అనుమానాలూ జరిగేవి కావంటూ’ రమణ చాలాసార్లు ఇదైపోయారు. ఈ విషయాన్నీ ఆయన తన కోతికొమ్మచ్చి పుస్తకంలో సవివరంగా రాసుకున్నారు.
(ముళ్లపూడి వెంకటరమణ కోతికొమ్మచ్చి పుస్తకం నుంచి)