”రామ్‌చరణ్‌తో ఎన్టీఆర్…”
కొన్నేళ్ల క్రితం అసలు ఈ కాంబినేషన్ ఊహించడానికే ధైర్యం సరిపోలేదు.
అసలు వీరిద్దరూ కలుస్తారా? కలిసి సినిమా చేస్తారా? అనే ఊహే ఎప్పుడూ రాలేదు. కానీ అది రాజమౌళి వల్ల సాధ్యమైంది.
అసలు ఇండ్రస్ట్రీ నడిచేదే కాంబినేషన్ అనే మ్యాజిక్ మీద. ఫలానా దర్శకుడు, ఫలానా హీరో కలిశారోచ్ అని చెప్పుకొంటే ఆ సినిమా క్రేజ్పెరిగిపోతుంటుంది. ఫలానా హీరోతో, ఫలానా హీరోయిన్ జోడీ కడుతుంది అనగానే ఆ సినిమాపై ఫోకస్ పెరుగుతుంది. అయితే ఇప్పుడు నడిచేదంతా మల్టీస్టారర్ల యుగం. ఇద్దరు హీరోలు కలసి చెట్టాపట్టాలేసుకొని ఒకేసారి కెమెరా ముందుకు వస్తుంటే చూడ్డానికి భలే బాగుంటుంది. అలా ఇద్దరు హీరోలు కలసి చేసిన సినిమాలన్నీ దాదాపుగా బాగానే ఆడాయి. అందుకే మల్టీస్టారర్ సినిమాలపై మరింత క్రేజూ, మోజూ పెరుగుతూ వస్తోంది. తాజాగా ‘ఆర్.ఆర్.ఆర్’ వల్ల.. మల్టీస్టారర్లకు మరింత బలం వచ్చేసింది. ఇప్పుడు ఏ ఇద్దరు కథానాయికలు కలిసినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆర్.ఆర్.ఆర్ ఇచ్చిన స్ఫూర్తితో ఫలానా కాంబినేషన్ వస్తే బాగుంటుంది కదా? అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇండ్రస్ట్రీ తలచుకొంటే సెట్ అవ్వని కాంబినేషన్ లేదు. అలాంటి మల్టీస్టారర్ల పై ఓసారి ఫోకస్ చేస్తే…??
నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో బాలకృష్ణ – ఎన్టీఆర్ కలసి నటిస్తే బాగుంటుందని కలలు కంటున్నారు. యేడాది క్రితం ఈ కాంబినేషన్ అంటే `అసాధ్యం` అని నందమూరి అభిమానులే బల్లగుద్ది చెప్పేవారేమో. కానీ అనుకుంటే మాత్రం అది సాధ్యమే. బాలయ్య బాబాయ్‌తో కలసి నటించాలని వుంది అని ఎన్టీఆర్ ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నాడు. బాబాయ్ – అబ్బాయ్‌ల మధ్య ఇది వరకటితో పోలిస్తే ఇప్పుడు కాస్త సంబంధాలు బాగున్నాయి. వీరిద్దరి మధ్య కల్యాణ్ రామ్ ఓ వారధిలా నిలిచాడు. కల్యాణ్ రామ్ ఫంక్షన్లకు ఇటు ఎన్టీఆర్, ఇటు బాలయ్య కలిసే వస్తున్నారు. ఈ సంప్రదాయం ఇక మీదటా కొనసాగే అవకాశం ఉంది. ఎన్టీఆర్ – బాలకృష్ణల సినిమా రావాలనుకుంటే మాత్రం అది కల్యాణ్ రామ్ వల్లే సాధ్యమవుతుందని నందమూరి అభిమానులు నమ్ముతున్నారు.
చిరంజీవిని – పవన్ కల్యాణ్‌నీ ఒకే సినిమాలో చూడాలని మెగా అభిమానుల ఆశ. పవన్ అతిథి పాత్రల్లో కనిపించిన క్షణాల్ని పక్కన పెడితే.. ఒకే కథలో వీరిద్దరూ కనిపించింది లేదు. అయితే ఆమధ్య టి.సుబ్బరామిరెడ్డి ఆ ప్రయత్నాలు చేశారు. త్రివిక్రమ్‌కి దర్శకత్వ బాధ్యత అప్పగించారు. ఆ సినిమా ఏమైందో తెలీదు. మధ్యలో పవన్ సినిమాల్ని వదిలేసి పూర్తిగా రాజకీయాలవైపు దృష్టి పెట్టాడు. ఈ ఎన్నికల తరవాత.. పవన్ మళ్లీ సినిమాలవైపు చూసే ఛాన్సుంది. అప్పుడైనా సుబ్బిరామిరెడ్డి కల, మెగా అభిమానుల ఆశ నెరవేరుతుందేమో చూడాలి.
మహేష్ బాబు – ఎన్టీఆర్
ఎన్టీఆర్ – ప్రభాస్
చరణ్ – బన్నీ
… ప్రస్తుతానికి ఈ కాంబినేషన్ల గురించి ఊహించడమే కష్టం. కాకపోతే.. హీరోల అభిప్రాయాలు, దర్శకుల ఆలోచనలూ మారుతున్నాయి. రాజమౌళి తరచుకున్నట్టే… ఏ అగ్ర దర్శకుడు తలచుకున్నా ఈ మల్టీస్టారర్లు రావడం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే బలమైన కథ దొరకాలంతే. మరీ అగ్ర హీరోల తో సినిమాలు రావడం కొంచెం కష్టమనుకుంటే ఓ అగ్ర హీరోతో… ఓ యువ హీరోని కలిపి సినిమాలు చేయొచ్చు. మహేష్ – నాని కలిశారనుకోండి. ఆ సినిమాకి క్రేజ్ రాకుండా ఎలా ఉంటుంది? విజయ్ దేవరకొండ – బన్నీ కలసి సినిమా చేస్తే.. అది రికార్డులు బద్దలు కొట్టకుండా ఉంటుందా?
ఇలా జరగాలంటే ముందు హీరోలు తమ ఇమేజ్ ఛట్రాల నుంచి, మార్కెట్ లెక్కల నుంచి బయటపడాలి. ఏ హీరోతో కలసి నటిస్తే ఏముందిలే.. అనుకోవాలి. ఆ ధైర్యం చేసినప్పుడే.. కొత్త తరహా సినిమాలొస్తాయి. కొత్త కథల్ని చూసే అవకాశం దక్కుతుంది.