భారతదేశ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటోంది. ఇలాంటి సమయంలో కొన్ని అవాంఛనీయమైన వ్యవహారాలపై చర్చ జరుగుతోంది. అలాంటి వాటిలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒకటి ఉండటం… విషాదమే. లైంగిక వేధింపుల కేసు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు… చాలా అభ్యంతరకరంగా ఉందని న్యాయనిపుణుల వాదన. న్యాయనిపుణులే కాదు… సమాజంలో అన్ని వర్గాలు ఆ తీర్పును చూసి ఆశ్చర్యపడుతున్నాయి. ” ఓ బాలిక వక్షస్థలాన్ని దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని, చట్టం ఇదే విషయాన్ని విశదీకరిస్తోందని” బాంబే హైకోర్టు ఓ కేసులో తీర్పు చెప్పింది.
ఈ కేసులో అసలు ట్విస్ట్ ఈ తీర్పు ఇచ్చింది మహిళా న్యాయమూర్తి. నాగ్‌పుర్ బెంచ్‌కు చెందిన మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలా 12 ఏళ్ల బాలికపై 39 ఏళ్ల ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నమోదైన కేసు విచారణ సందర్భంగా.. . దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపుల కిందకు రాదని తేల్చారు. లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి, లేదా దుస్తుల లోపలకి చేయి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని పేర్కొంది. కింది కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను కొట్టి వేసింది. అయితే అదే సమయంలో మహిళ గౌరవానికి భంగం కలిగించడం, దురుద్దేశంతో నిర్బంధించడం కింద ఏడాది శిక్షను ఖరారు చేశారు.
పిల్లలపై లైంగిక వేధింపులు ఆపడానికి అనేకానేక చట్టాలు వస్తున్నాయి. అయితే.. ఆ చట్టాల్లో స్పష్టత లేకపోవడంతో న్యాయస్థానాలు కూడా అనేక రకాలుగా తీర్పులు ఇస్తున్నాయి. ఈ క్రమంలో నాగపూర్ మహిళా న్యాయమూర్తి చట్టం ప్రకారమే తీర్పు ఇచ్చారు. అదే చర్చనీయాంశం అవుతోంది. అనేక మంది సోషల్ మీడియాలో ఈ అంశంపై చర్చ పెట్టారు. చర్చ కొనసాగిస్తున్నారు. మహిళా న్యాయమూర్తి ఇలాంటి తీర్పు ఇచ్చారేమిటి అని మాట్లాడుకుంటున్నారు. బాంబే హైకోర్టు తీర్పు వల్ల.. కొంత మంది పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడేవారి వాదనకు అవకాశం దొరుకుతుందని ఆందోళన చెందుతున్నారు.