సేవ చేయాలంటే పదవే అవసరం లేదు. వయసుతో నిమిత్తం లేదు. క్యాన్సర్ తో బాధపడే వంద మందికి పైగా బాలల చికిత్స కోసం సాయం చేయడానికి ఓ ముంబై బాలుడు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం నిధుల సేకరణపై దృష్టి పెట్టాడు. కేవలం రెండు రోజుల్లో 9 లక్షల రూపాయలు సేకరించాడు. ఎలా అంటే, సోషల్ మీడియా ద్వారా.
అతడి పేరు ఆరవ్. ఓ ప్రయివేట్ స్కూల్లో 7వ తరగతి విద్యార్థి. నర్గిస్ దత్ స్వచ్ఛంద సంస్థలో అతడి తల్లి పనిచేస్తున్నారు. ఆ ప్రభావంతో ఆ బాలుడికీ సేవా రంగంపై ఆసక్తి ఏర్పడింది. క్యానర్స్ తో బాధపడుతున్న వంద మందికి పైగా బాలల చికిత్సకు సాయం చేయాలని నిర్ణయించాడు. ఇందుకోసం సోషల్ మీడియాను ఎంచుకున్నాడు.
ఈ విషయాన్ని ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన ఫేస్ బుక్ పేజీలో షేర్ చేశాడు. అంతే, అతడి ఉదాత్త ఆశయం నచ్చిన ఎంతో మంది విరాళాలు పంపారు. అలా రెండు రోజుల్లోనే 9 లక్షల రూపాయలకు పైగా వసూలయ్యాయి. ఇంతకు ముందు కూడా చాలా మంది దాతలను కలిసి, క్యాన్సర్ బాధితుల పరిస్థితి వివరించి విరాళాలు సేకరించే వాడు. అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసే వాడు.
ఇప్పుడు త్వరలోనే ముంబైలో ఓ మారథాన్ ప్లాన్ చేస్తున్నాడు. స్పానర్లు, ఇతర మార్గాల్లో వచ్చే డబ్బును క్యాన్సర్ బాధిత బాలల చికిత్స కోసం వెచ్చించనున్నాడు. పిట్ట కొంచెం కూత ఘనం అంటారు. ఈ బుడతడి ఆశయం కూడా ఘనమే.