తిరుపతిలో అలిపిరి వద్ద ట్రైడెంట్ గ్రూపు సెవన్ స్టార్ హోటల్ నిర్మించాలని గత ప్రభుత్వంలో ల్యాండ్ ఇచ్చారు. అయితే ట్రైడెంట్ గ్రూపు తమ సబ్సిడరీ కంపెనీకి ముంతాజ్ అని పేరు పెట్టింది. ఆ బోర్డును తెచ్చి అక్కడ పెట్టింది. కారణం ఏమో కానీ పనులు అనుకున్నంతగా చేయలేదు. దాంతో ముంతాజ్ హోటల్ అంటే ముస్లింలది అని.. మసీదు అని కొంత మంది హడావుడి ప్రారంభించారు. పేరే వివాదమా అని ఆ కంపెనీ ఆ పేరు తీసేసి.. ట్రైడెంట్ హోటల్స్ అని పెట్టింది.
అయితే కొంత మంది స్వామిజీలు మాత్రం.. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి స్పాన్సర్ షిప్‌తో దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షలకు అన్నీ ఆయనే చూసుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే కొంత మంది బీజేపీ కండువాలతో వచ్చి కూర్చుంటున్నారు. ఆ హోటల్ ఒప్పందాన్ని రద్దు చేయాలని వారంటున్నారు. అది తిరుపతి అభివృద్ధికి ఎంతో ఉపయోగపడే హోటల్. హైదరాబాద్ వంటి చోట్ల ఉండే సెవన్ స్టార్ హోటల్. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని చెప్పి..దాన్ని జగన్ కేటాయించినప్పటికీ.. చంద్రబాబు కొనసాగించాలని నిర్ణయించారు.
అయితే ఇప్పుడు భూమన అదేదో వేరే మతానికి చెందినదని ప్రచారం చేసేందుకు స్వామిజీల పేరుతో కొంత మందిని పిలిపించి షో చేయిస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో కేసు తన దగ్గరకే వస్తుందని ఆయన కంగారు పడుతున్నారేమో కానీ..రోజుకో సారి ప్రెస్‌మీట్ పెట్టి..సీబీఐ సిట్ నలుగురు అరెస్టు చేసింది కానీ కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని చెప్పలేదని వితండవాదం చేస్తున్నారు. ఆయన తీరు చూసి వైసీపీ నేతలు కూడా ఇంత కంగారు పడుతున్నారు ఎందుకు అని ఆశ్చర్యపోతున్నారు.