ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు రుణాలివ్వడం లేదని బ్యాంకుల ముందు .. మున్సిపల్ సిబ్బందే చెత్త వేసిన ఘటన సంచలనం రేపుతోంది. బుద్ది, జ్ఞానం ఉన్న ఏ మున్సిపల్ అధికారి ఇలాంటి పనులు చేయరు. పై నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తేనే.. వారి ప్రాపకం కోసం వెంపర్లాడే అధికారి అయితేనే ఇలాంటి పనులు చేస్తున్నారు. ఎవరికైనా కోపం వస్తే ఆర్గనైజ్డ్గా ఇలాంటి చెత్త వేసే కార్యక్రమం చేయరు. కృష్ణా జిల్లాలో దాదాపుగా ముఫ్పై, నలబై బ్యాంక్ బ్రాంచీల ముందు చెత్త కుప్పలు వేసేసారు. ఉదయం విధులకు వచ్చిన బ్యాంకు సిబ్బంది.. ప్రధాన ద్వారాల వద్ద చెత్తను చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే మున్సిపల్ సిబ్బందిని వాకబు చేస్తే తమ అధికారులు చెప్పినట్లుగా చేశామని తేల్చేశారు. ఉన్నతాధికారుల్ని సంప్రదిస్తే రుణాలు ఇవ్వకపోవడం వల్లే ఇలా చేశామని బోర్డులు కూడా పెట్టామని రెటమతంగా చెప్పారు.
జగనన్న తోడు, వై యస్ ఆర్ చేయూత పథకాల కోసం బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం సూచించింది. కానీ కడతారన్న నమ్మకం లేని వారికి బ్యాంకులు అప్పులు ఇవ్వలేదు. దీంతో ఆయా బ్యాంకుల ముందు చెత్త పోయాలని ఆదేశాలు వచ్చేశాయి. పైవాళ్లు చెప్పాక.. ఇక ఆగుతారా… చేసేశారు. పధకాలకు నిధులు ఇవ్వనందున.. ఈ విధంగా నిరసన తెలుపుతున్నట్లు ఉయ్యూరు కమిషనర్ పేరుతో పోస్టర్లు కూడా అంటించారంటే.. ఎంతగా బరి తెగించారో అర్థం చేసుకోవచ్చు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా అనేక బ్యాంకుల ముందు చెత్త వేసిన అంశం వివాదంగా మారింది. ఇదేం ఫ్యాక్షన్ స్టైల్ అనుకోవడం ప్రారంభించారు. దీంతో చెత్తను తొలగించారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ బ్యాంక్ అధికారులకు ఫోన్ చేసి.. రుణాలు ఇవ్వలేదని మున్సిపల్ సిబ్బందే అలా చేశారని.. తమ పాత్రేమీ లేదని చెప్పుకొచ్చారు. కానీ అందర్నీ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా.. బ్యాంకుల్ని కూడా చేస్తున్నారని ఎవరికైనా అర్థమైపోతుందని అంటున్నారు. ఈ వ్యూహాన్ని అమలు చేయమని చెప్పిన పెద్ద మనిషి ఎవరో బయటకు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై బ్యాంకుల సంఘం తీవ్రంగా స్పందించింది. కానీ అలాంటి వాటిని పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వ పెద్దలు లేరు.