హైదరాబాద్ నలువైపులా విస్తరిస్తున్న సమయంలో ప్రశాంతంగా ఎక్కడ ఉండవచ్చో చాలా మంది వాకబు చేసుకుని మరీ ఇళ్లు కొనుక్కుంటున్నారు. కొన్ని కొన్ని ప్రాంతాలకు పెద్దగా ప్రచారం రావడం లేదు. అలాంటి చోట్ల ధరలు తక్కువగానే ఉంటున్నాయి. విజయవాడ హైవే వైపు ఇళ్లు కొనుగోలు చేయాలనుకునేవారికి మంచి ఆప్షన్‌గా హయత్ నగర్ సమీపంలోని మునగనూరు ఉంది. రామోజీ ఫిల్మ్ సిటీకి దగ్గరగా ఉన్న ఈ గ్రామానికి మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయి.
ఔటర్ రింగ్ రోడ్ లోపల గ్రామాలన్నింటినీ గ్రేటర్ లో కలిపేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోకి ఈ గ్రామం వస్తుంది. అపార్టుమెంట్.. నలభై నుంచి యాభై లక్షలోపు ధరకే బిల్డర్లు అమ్ముతున్నారు. ఇండిపెండెట్ హౌస్‌లు కూడా తక్కువ ధరకే వస్తున్నాయి. ఉప్పల్, ఎల్బీనగర్, నాగోల్, హయత్ నగర్, పోచారం, మేడిపల్లి, కీసర, రాంపల్లి వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం రాబోయే కాలంలో మరింత వృద్ధి చెందనుంది. వాణిజ్య పరమైన ఆస్తులను కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. హైదరాబాద్ వెస్ట్‌జోన్‌తో పోలిస్తే ఈస్ట్ జోన్లో ప్రాపర్టీల ధరలు తక్కువగా ఉండటం కూడా ఎక్కువ మంది చూపు అటు వైపు పడటానికి కారణం.
ఎల్బీనగర్-హయత్ నగర్ మార్గం ఇప్పుడు పశ్చిమ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ-కోకాపేట కారిడార్‌లా మారనుంది. మౌలిక సదుపాయాలు, విద్యుత్ సరఫరా లేదా తాగునీరు పరంగా మెరుగైన వసతులు ఉన్నాయి. భారీ రియల్ ఎస్టేట్ కంపెనీలు సైతం ఇటువైపు దృష్టి సారిస్తున్నాయి. మరో పదేళ్లకు దరాబాద్-విజయవాడ కారిడార్ మరీ ముఖ్యంగా రామోజీ ఫిల్మ్ సిటీ వరకూ తిరుగులేకుండా వృద్ధి చెందుతుందని ఇప్పుడే అటు వైపు ఇళ్లు కొనుక్కుంటే.. తిరుగులేని లాభాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.