దౌర్జన్యాలు, బలవంతపు ఉపసంహరణలు జరిగాయని ఆరోపణలు వచ్చిన చోట మరోసారి నామినేషన్లకు ఎస్ఈసీ అవకాశం కల్పించారు. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి కార్పొరేషన్, పుంగనూరు, రాయచోటి పురపాలక సంఘాలు, ఎర్రగుంట్ల నగర పంచాయతీల్లో మాత్రమే అవకాశం కల్పించారు. దౌర్జన్యాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయలేకపోయామని అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులను పరిశీలించి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో ఆరు వార్డుల్లో రేపు మధ్యాహ్నం వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. పుంగనూరులో మూడు వార్డులు, రాయచోటిలో రెండు, ఎర్రగుంట్లలో మూడు వార్డుల్లో మళ్లీ నామినేషన్లకు చాన్స్ ఇచ్చారు.
రేపు మధ్యాహ్నం వరకు నామినేషన్లు వేయవచ్చు. 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే ప్రారంభించాలని నిర్ణయించుకున్న ఎస్ఈసీ… బలవంతపు ఏకగ్రీవాలపై మాత్రం.. విచారణ జరిపించాలని నిర్ణయించారు. దౌర్జన్యంగా నామినేషన్లను ఉపసంహరించేసిన ఘటనలు… నామినేషన్లు వేయనివ్వకపోవడం వంటివి చోటు చేసుకుంటే ఫిర్యాదులుచేయాలన్నారు. అలాంటి వారు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు.
అయితే జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చిన నివేదిక మేరకు కొన్ని చోట్ల మాత్రమే.. నామినేషన్లకు అవకాశం కల్పించారు. తాడిపత్రి మున్సిపాలిటీలో మళ్లీ నామినేషన్లకు అవకాశం కల్పించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. హైకోర్టులోనూ పిటిషన్ వేశారు. అయితే అక్కడ కలెక్టర్ సానుకూలంగా నివేదిక ఇవ్వలేదేమో కానీ.. ఎస్ఈసీ మాత్రం అక్కడ మల్లీ నామినేషన్లకు చాన్స్ ఇవ్వలేదు.