వరుసగా మారుతున్న పరిస్థితులతో.. టీఆర్ఎస్లో మున్సిపల్ ఎన్నికలపై ఆందోళన ప్రారంభమయింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా స్వీప్ చేసేందుకు సిద్ధమయిన టీఆర్ఎస్.. ఇప్పుడు మాత్రం… ఎన్నికలు ఇప్పుడల్లా జరగకపోతేనే బెటర్ అన్న ఆలోచనకు వస్తోంది. ఇప్పుడు కనుక మున్సిపల్ ఎన్నికలు జరిగితే .. బీజేపీకి కశ్మీర్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందేమోననని.. టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు. ఇప్పటికే పార్టీ సభ్యత్వం విషయంలో యువత, విద్యావంతులంతా బీజేపీ వైపు వెళుతున్నారని… ఇప్పుడు కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు చేయడంతో ఎక్కడ చూసినా బిజెపి ఘనత పైనే చర్చ జరుగుతోందని.. టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా యువత, అర్బన్ ఓటర్లలో బీజేపీపై ఫీల్ గుడ్ వాతావరణం క్రియేట్ అయ్యిందనే అభిప్రాయానికి టీఆర్ఎస్ పెద్దలు కూడా వచ్చారు.
పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ హవా గులాబీ పార్టీ ఆశలకు గండి కొట్టింది. తెలంగాణలోని యువత, ఉద్యోగులందరూ బిజెపి వైపు మొగ్గు చూపారు. కేసీఆర్ కుమార్తె కవితనే ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీపై రివెంజ్ తీసుకోవాలని ప్లాన్ చేస్తోంది టిఆర్ఎస్. అందుకోసం గులాబీ పార్టీ మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం అయ్యింది. కానీ కేంద్ర పరిణామాలతో.. దేశం మొత్తం మోడీ నాయకత్వాన్ని కొనియాడుతుందనే చర్చ అధికార పార్టీలో జరుగుతోంది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి ఓటు వేసిన యువత, ఉద్యోగులు స్థానిక ఎన్నికల్లో టిఆర్ఎస్ కే ఓటు వేస్తారన్న చర్చ ఇప్పటి వరకు సాగినా…ఇప్పుడు ఎన్నికలు వస్తే అర్బన్ ఓటర్లు అందరూ బిజెపి కే ఓట్లు వేస్తారనే భయం గులాబీ పార్టీ లో మొదలయింది.
ఈ నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే కమలం పార్టీ మరోసారి తమను దెబ్బ కొడుతుందని గులాబీ నేతలు జంకుతున్నారు. ఒక్కసారి అమిత్ షా ,లేదా ప్రధాని మోడీ తెలంగాణలో అడుగుపెడితే ఆ పార్టీ బలం పెరుగుతోందనే భావనలో టిఆర్ఎస్ నేతలు ఆలోచనలో పడ్డారు. బీజేపీపై ఇప్పుడున్న సెంటి మెంట్ కు తోడు తమపై వ్యతిరేకత కూడా ప్రభావం చూపిస్తుందనే చర్చ టిఆర్ఎస్ లో జరుగుతోంది. హైకమాండ్ కూడా… మున్సిపల్ ఎన్నికలు ఎంత దూరం జరిపితే.. అంత మంచిదన్నట్లుగా ఉందని చెబుతున్నారు.