మునుగోడు ఉపఎన్నికల్లో పది వేల ఓట్లమెజార్టీతో వచ్చిన గెలుపు టీఆర్ఎస్లో కొత్త జోష్ నింపింది. సీఎం కేసీఆర్కు ఇది అత్యంత క్లిష్టమైన సమయంలో వచ్చిన విజయం అనుకోవచ్చు. తెలంగాణలో ఎనిమిదేళ్లలో ఊహించనంత అభివృద్ధి సాధించినా..రాజకీయ కారణాలతో వచ్చిన ప్రజా వ్యతిరేకతను అధిగమించడానికి కేసీఆర్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. తమ పార్టీని దెబ్బకొట్టడానికి వచ్చిన ఉపఎన్నికలో పోరాడి విజయం సాధించడంతో ఇప్పుడు గతంలో లేనంత పాజిటివ్ నెస్ కనిపిస్తోంది. టీఆర్ఎస్ శ్రేణుల్లోనూ ఈ ఉత్సాహం కనిపిస్తోంది. మూడో సారి కూడా ఎదురు లేదన్న నమ్మకానికి వచ్చారు. దీంతో ఇప్పుడే ముందస్తుకు వెళ్తే మంచిదన్న ఆలోచన చేస్తున్నారు.
తెలంగాణలో ఏడాదిగా ముందస్తు ఎన్నికలపై చర్చ జరుగుతోంది. కానీ కేసీఆర్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెబుతూ వస్తున్నారు. ఇటీవల టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చుతూ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ముందస్తు ఎన్నికల ముచ్చటే లేదు. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. ఫామ్ హౌస్ ఫైల్స్ బయటపెట్టిన తర్వాత కేసీఆర్ ఆలోచన మారిందని అంటున్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో గెలుపు రావడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన పాజిటివ్ వైబ్రేషన్స్ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం మంచిదని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగిన బీజేపీని కార్నర్ చేయడానికి.. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని అడ్డగోలుగా పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నించిందని ఆధారాలు చూపించడం ద్వారా ఓ ఆయుధం కేసీఆర్ వద్ద ఉంది. ఇలాంటి ఆయుధం ఉంటే కేసీఆర్ ఎలా సెంటిమెంట్ పండించగలరో రాజకీయ ప్రత్యర్థులకు బాగా తెలుసు. అందుకే అంది వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారనే ఎక్కువ మంది నమ్ముతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉంది. ఇప్పుడు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నా.. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. కే్సీఆర్ జాతీయ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలనుకుంటున్నారు. తెలంగాణలో మూడో సారి గెలిస్తే.. ఆ ప్రభావం దేశం మొత్తం ఉంటుంది. ఉత్తరాదిలో కూడా ఆయనకు కీలకమైన నేతగా గుర్తింపు లభిస్తుంది.