మునుగోడు ఉపఎన్నికల ఫలితాలు ప్రకటించడంలో ఎన్నికల అధికారులు ఉద్దేశపూర్వ ఆలస్యం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్, మొదటి రౌండ్ ఓట్లలో టీఆర్ఎస్కు మంచి లీడ్ కనిపించింది. దాంతో ఫలితాలు వెంటనే వచ్చాయి. కానీ తర్వాత మూడు రౌండ్ల ఫలితాలు వచ్చినా అధికారికంగా ప్రకటించలేదు. నాలుగో రౌండ్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రీకౌంటింగ్ అడగడంతో మరింత ఆలస్యం అయింది. ఏదో గోల్ మాల్ జరుగుతోందనుకున్న బీజేపీ .. నేరుగా కిషన్ రెడ్డిని రంగంలోకి దింపింది.
ఆయన సీఈవో వికాస్‌రాజ్‌కు ఫోన్ చేసి.. మండిపడ్డారు. ఫలితాల ప్రకటనలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో క్షమాపణ చెప్పిన వికాస్ రాజ్ వెంటనే ఫలితాలను అప్ లోడ్ చేశారు. సాధారణంగా పావుగంటకో రౌండ్ పూర్తవుతుంది. పదకొండు గంటలకల్లా ఫలితం తేలిపోవాలి. కానీ ప్రతీ రౌండ్ ఆలస్యంగానే సాగుతోంది. మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఐదు రౌండ్ల కౌంటింగ్ మాత్రమే పూర్తయింది. మొత్తంగా టీఆర్ఎస్ పధ్నాలుగు వందల ఓట్ల ఆధిక్యంలో ఉంది.
చౌటుప్పల్ మండలంపై బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ అనుకున్నంత మెజార్టీ లేదని బీజేపీ అభ్యర్థి వాపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి ఊహించినట్లుగానే మూడో స్థానంలో దూరంగా ఉండిపోయారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. చివరి రౌండ్ వరకూ విజయం ఎవరిదో చెప్పడం కష్టమన్నట్లుగా ట్రెండ్ ఉంది.