మునుగోడు ఉపఎన్నిక రాజకీయ పార్టీల సంకుల సమరంగా మారింది. సెమీ ఫైనల్ కావడం చావో రేవో అన్నట్లుగా మారడంతో అన్ని రాజకీయ పార్టీలు .. శక్తివంచన లేకుండా పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను అన్ని రాజకీయ పార్టీలు ఖరారు చేశాయి. ఇప్పుడు అందరూ బరిలోకి దిగారు. అయితే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఒకరికొకరు ఎంత ఖర్చు పెట్టబోతున్నారో చెబుతూ ప్రజల్ని ఆశ్చర్య పరుస్తున్నారు. వారు చెబుతున్న మాటల్ని బట్టి చూస్తే ఏవరేజ్‌గా ఒక్కో ఓటుకు పాతికవేలు ఖాయమన్నట్లుగా రాజకీయం మారిపోయింది.
రూ. ఇరవై వేల కోట్ల కాంట్రాక్ట్ ను బీజేపీ నుంచి తీసుకుని రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారని.. ఉపఎన్నిక తీసుకు వచ్చారని కేటీఆర్ ఆరోపించారు. ఉపఎన్నికలో ఐదు వందల కోట్లు ఖర్చు పెడతానని హమీ ఇచ్చారన్నారు. అందుకే ఓటుకు ముఫ్ఫై వేల వరకూ పంచుతారని కేటీఆర్ విమర్శించారు. అయితే ప్రజలు మాత్రం వారి దగ్గర డబ్బులు తీసుకుని తమకే ఓటేస్తారన్నారు. ఈ విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. డబ్బుతో రాజకీయం చేస్తోంది టీఆర్ఎస్సేనని.. ఓటుకు రూ. నలభై వేలు ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదని బీజేపీ నేతలు రివర్స్‌లో ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్థికంగా మరీ బలవంతురాలు కాకపోవడంతో పాటు టీఆర్ఎస్, బీజేపీ అధికార పార్టీలు కావడంతో డబ్బు రాజకీయాలన్నీ రెండు పార్టీల మధ్యనే సాగుతున్నాయి.
మునుగోడులో ఇప్పటికే పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం సాగుతోంది. లగ్జరీ కార్లు ప్రతీ గ్రామంలోనూ తిరుగుతున్నాయి. కోట్లకు కోట్లు అసువుగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఈ రాజకీయం అక్కడి ప్రజలకు కూడా వింతగా ఉంది. చాలా ఎన్నికలను చూశారు కానీ ఈ సారి ఎన్నికలు మాత్రం వారికి ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. చోటా మోటా నేతల దగ్గర్నుంచి ప్రతి ఒక్కరికీ ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ డిమాండ్ ఏర్పడింది.