అంచనాలు ఎక్కువైతే ఎంత చేసినా .. ఫ్లాపే. ఈ ఫార్ములా సినిమాలకే కాదు..రాజకీయాలకూ వర్తిస్తుంది. మునుగోడు ఉపఎన్నికల్లో రాజకీయ పార్టీలు చేస్తున్న ఖర్చులను చూసి ప్రజలకు ఇప్పుడే ఇలా ఉంటే.. ఓటుకు ఎంత ఇస్తారోనని ఆశపడ్డారు. దానికి తగ్గట్లుగానే టీఆర్ఎస్ నేతలు ఓటుకు పదివేలు పంచినా తమకే ఓటు వేయాలని బీజేపీ నేతలు ప్రచారం చేశారు. రాజగోపాల్ రెడ్డికి పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందని తులం బంగారం ఇస్తారని ఆయినా టీఆర్ఎస్కే ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు ప్రచారం చేశారు. అందుకే తమ ఓటుకు చాలా విలువ వచ్చిందని అక్కడి ఓటర్లు ఫీలయ్యారు.
తీరా ఎన్నికల సమయం దగ్గర పడే సరికి.,. ఓటింగ్‌కు ముందు రోజు రాజకీయ పార్టీలు ఆ అంచనాలను అందుకోలేకపోయారు. ప్రధాన పార్టీలు రూ. నాలుగు వేల వరకే పంచగలిగారు. కాంగ్రెస్ పార్టీ అయితే .. తమ ఓట్లు కాపాడుకోవడానికైనా రూ. వెయ్యి పంచాల్సి వచ్చింది. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పోటీ పడ్డారు. అయితే బీజేపీ ఎన్నో అనుకున్నా.. కొంత వెనుకబడినట్లుగా తెలుస్తోంది. దీంతో ఓటర్లు నిరాశకు గురయ్యారు. పలు చోట్ల ధర్నాలు చేశారు. తాము ఎంతో ఊహంచామని దానికి తగ్గట్లుగా డబ్బులివ్వాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యాన్ని కొనుక్కోవచ్నచ్నట్లుగా రాజకీయ పార్టీలు చేస్తున్న రాజకీయానికి పరాకాష్టగా మునుగోడు ఉపఎన్నిక కనిపిస్తోంది. ఓట్లను అమ్ముకోవడానికి ఎమ్మెల్యేలే కాదు ఓటర్లూ పోటీ పడుతున్నారు. ఎవరు కొనుక్కుంటే వారిదే విజయం అన్నట్లుగా రాజకీయం మారిపోయింది. దానికి మునుగోడు ఉపఎన్నిక సాక్ష్యంగా కనిపిస్తోంది.