భారతీయ జనతా పార్టీలో ఏపీ విమర్శల విభాగం అనేదేదో ఉందేమో.. దాని బాధ్యతలన్నీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావుకి మాత్రమే ఇచ్చారేమో అన్నట్టుగా ఆయన విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆధారాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం ఆరోపణలు చెయ్యడమే ఆయన పని. అయితే, తాజాగా ఆయన చేస్తున్న ఆరోపణలపై టీడీపీ నేతలు సీరియస్ అవుతున్నారు. జీవీఎల్ ఆరోపణల నేపథ్యంలో టీడీపీ ఎంపీలు ఢిల్లీలో స్పందించారు. జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ… ఆయనకి టీవీల్లో కనిపించాలన్న మోజు ఈ మధ్య బాగా ఎక్కువైందని ఎద్దేవా చేశారు. నోటికొచ్చినట్టు మాట్లాడటం రాజకీయాల్లో సరైన పద్ధతి కాదని ఆయన సూచించారు.
ఎంపీ మురళీ మోహన్ మాట్లాడుతూ… వెనకటికి ఒక దారి దోపిడీ దొంగ ఉండేవాడనీ సరదాగా ఓ పిట్టకథ చెప్పారు. ఒక కొండ మీద కూర్చున్న దొంగ.. దారిన పోతున్నవారిని బెదిరించేవాడనీ, ఉన్న డబ్బూ నగలూ అన్నీ అక్కడ పెట్టేసి వెళ్లిపోవాళంటూ చెప్తుండేవాడనీ, వాడిని చూసి భయపడ్డ చాలామంది అదే పనిచేసేవారనీ మురళీ మోహన్ చెప్పారు. అయితే, ఈ దొంగ తీరు మీద ఒకడికి అనుమానం వచ్చిందనీ, ఆ దొంగ కొండమీద ఉన్న బండ మీదే ఎందుకు కూర్చుంటున్నాడూ, కిందికొచ్చి జనాల్ని నేరుగా ఎందుకు దోచుకోవడం లేదని వెళ్లి చేస్తే… వాడికి రెండు కాళ్లూ లేవని తేలిందట అన్నారు! జీవీఎల్ నర్సింహారావుది కూడా అదే పరిస్థితి అని ఎద్దేవా చేశారు. రోజూ ఆయన ఏదో ఒకటి చెబుతుంటారుగానీ, ఒక్కదానికి కూడా ఆధారం లేదన్నారు. చేస్తున్నా ఆరోపణలపై ఆధారాలుంటే, దమ్ముంటే ధైర్యముంటే ప్రజల్లోకి వెళ్లి మాట్లాడుకుందామన్నారు. అయినా జీవీఎల్ కి ఉన్న రాజకీయ అనుభవం ఏపాటిదనీ, ప్రత్యక్ష ఎన్నిక ద్వారా కనీసం ఒక పంచాయతీ నుంచి అయినా గెలిచారా; ఎంపీ సీటు రాగానే ఇలా మాట్లాడేయటమేనా అంటూ మురళీమోహన్ ప్రశ్నించారు.
రైల్వేజోన్ విషయమై ఢిల్లీలో పోరాటం చేసేందుకు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధులు వస్తున్నారనీ, మంగళవారం నాడు తామంతా కలిసి రైల్వే మంత్రి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వెళ్లబోతున్నామని చెప్పారు. ఒకవేళ తమకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే రైల్వే కార్యాలయం వద్ద నిరసన తెలుపుతామన్నారు.
మొత్తానికి, జీవీఎల్ అంశమై టీడీపీ నేతలు మూకుమ్మడిగా ఎదురు దాడికి దిగారనే అనుకోవచ్చు. ఇన్నాళ్లూ ఆయన ఢిల్లీలో రోజుకో ప్రెస్ మీట్ పెట్టేవారు. కానీ, ఇప్పుడు ఆంధ్రాకి వచ్చి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కనీసం కొన్ని ఆధారాలతోనైనా ఆరోపిస్తే ఆ పార్టీకే మైలేజ్ పెరుగుతుంది కదా! కేంద్రంలో అధికారంలో ఉన్నదీ వారే. ఉన్న ఆధారాలేవో అక్కడే సమర్పిస్తే చర్యల్లాంటివి ఏవైనా ఉంటాయి కదా! ఆయనొక్కరే ఇలా ఆయాస పడుతూ మాట్లాడాల్సిన శ్రమ కూడా తగ్గుతుంది.