తమిళనాట `800` సినిమా…. ప్రకంపనలు సృష్టిస్తోంది. మురళీధరన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఆ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. ఇటీవల ప్రీ లుక్ కూడా విడుదలైంది. ఆ లుక్ చూసి విజయ్ అభిమానులు, క్రీడాభిమానులు సంతోషించినా, కొన్ని తమిళ సంఘాలు.. నిరసన వ్యక్తం చేశాయి. మురళీధరన్ తమిళ ద్రోహి అని, తన సినిమాలో విజయ్ నటించకూడదని అడ్డు చెప్పాయి. భారతీరాజా, చేరన్ లాంటి దర్శకులు సైతం ఈ సినిమాని వదులుకోవాలని విజయ్ సేతుపతిపై ఒత్తిడి తీసుకొచ్చారు. విజయ్‌ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగులు షురు అయ్యాయి.
ఈ సినిమాపై ఇప్పుడు మురళీధరన్ తొలిసారి స్పందించాడు. తనని తమిళ ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, తాను తమిళులకు వ్యతిరేకం కాదని తేల్చి చెప్పాడు. “నాకు వివాదాలు కొత్త కాదు. నా జీవితం యుద్ధ భూమిలో మొదలైంది. నాకు ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడు నా తండ్రి చనిపోయారు. యుద్ధ ప్రాబల్య ప్రాంతంలో ఉంటూ మనుగడ సాగించడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. శ్రీలంక తమిళుడిగా పుట్టడం నా తప్పా? ఒకవేళ భారత్‌లో పుట్టి ఉంటే టీమిండియాలో ఆడేవాడిని. నేను తమిళులకు వ్యతిరేకం అంటూ వివాదం రేకెత్తించారు. రాజకీయ రంగు పులిమారు. శ్రీలంకలో తమిళుల నరమేధానికి నేను మద్దతు పలికానని ఆరోపించారు. 2009లో పరిస్థితులను తప్పుగా అర్థం చేసుకుని ఆ వ్యాఖ్యలు చేశాను. జీవితమంతా యుద్ధ భూమిలో గడిపిన వాడికి యుద్ధం ముగియడమనేది గొప్ప విషయం. రెండు వైపులా ఇకపై ప్రాణాలు కోల్పోవడం ఉండదని సంతోషపడ్డాను. తమిళుల అందరిలోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకే నా కథను వెండితెరపై చెప్పాలనుకున్నాన`ని మురళీధర్ చెబుతున్నాడు.
ప్రముఖ నటి ఖుష్బూ `800` చిత్రానికి మద్దతు తెలుపుతోంది. సినిమాని సినిమాగానే చూడమని హితవు పలుకుతోంది. మురళీధరన్‌పై అంత వ్యతిరేకత ఉంటే..ఐపీఎల్ హైదరాబాద్ జట్టుకి మురళీధరన్ ని బౌలింగ్ కోచ్‌గా ఎందుకు నియమించారని ప్రశ్నిస్తోంది. మురళీధరన్ గొప్ప ఆటగాడని, తన క్రీడా స్ఫూర్తికైనా గౌరవం ఇవ్వాలని సూచించింది.