చీరాలలో నాగార్జున రెడ్డి అనే జర్నలిస్టుపై హత్యాయత్నం జరిగింది. దారి కాచి .. కిడ్నాప్ చేసి మరీ దుండగులు.. నాగార్జునరెడ్డిని మట్టుబెట్టే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. దీనికి కారణం.. నాగార్జున రెడ్డిపై హత్యకు కుట్ర చేసింది..మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు. రౌడిషీటర్గా ఉన్న స్వాములుపై.. పదుల సంఖ్యలో కేసులున్నాయి. ఇదే నాగార్జునరెడ్డిపై గతంలో దాడి చేసిన కేసు కూడా ఉంది. నాగార్జున రెడ్డి ఓ ప్రముఖ పత్రికలో చాలా కాలంగా విధులు నిర్వహిస్తున్నారు. చీరాల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆమంచిపై… ఆయన చేస్తున్న పనులపై వరుసగా కథనాలు ప్రచురించేవారు. ఈ క్రమంలో పలుమార్లు.. ఆమంచి నుంచి .. ఆయన సోదరుల నుంచి దాడులను ఎదుర్కొన్నారు.
హత్యాయత్నంలో గాయపడిన నాగార్జునరెడ్డిని మొదట చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పట్టణంలో ప్రయివేటు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో ఒంగోలుకు తరలించారు. గతంలో చీరాల గడియారం స్తంభం సెంటర్లో ఆమంచి స్వాములు నాగార్జున రెడ్డిపై నడిరోడ్డుపైనే కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఓడిపోయినప్పటికీ.. అధికార పార్టీలో ఉండటంతో.. అధికారులను గుప్పిట్లో పెట్టుకుని… ఆమంచి సోదలు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మీడియా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మీడియా చానళ్లను ప్రసారం చేయవద్దని… కేబుల్ ఆపరేటర్లను… ప్రభుత్వం బెదిరించింది. దీంతో కొన్ని చానళ్ల ప్రసారాలు నిలిచిపోయాయి. ఇప్పుడు.. జర్నలిస్టులపై దాడులు కూడా ప్రారంభమయ్యాయి. హత్యాయత్నం చేసినా.. పోలీసులు అంత వేగంగా స్పందించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమంచి సోదరులు… చీరాలలో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని.. మీడియాపై సైతం బెదిరింపులకు పాల్పడుతున్నారని చాలా రోజులుగా ఆరోపణలున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు. దీంతో.. మరో అడుగు ముందుకేసి.. తమ పై వ్యతిరేక వార్తలను రాశారని.. జర్నలిస్టునే హత్య చేయడానికి సిద్ధపడ్డారు.