బ్లాక్ అండ్ వైట్ కాలం ఆలోచనలు.. అప్పటి సినిమాలు చూసి.. ఇప్పటి రాజకీయాలు చేయడం అంటే కష్టమే. రావుగోపాలరావు లాంటి విలన్.. హీరోని ఇరికించడానికి.. తన మనుషుల్నే పోలీసుల వద్దకు పంపించి.. లొంగిపోయేలా చేసి.. తాము హీరో పంపితే.. దొంగ పని చేశామని చెప్పి… కేసు బుక్ చేయించేస్తారు. దాని వెనుక డ్రామా ఉంటుంది. కాకపోతే.. అప్పట్లో ఇది సూపర్ హిట్ ఫార్ములా. కానీ కాలం మారింది కదా.. అలాంటి సీన్లే పెట్టి ఇప్పుడు సినిమా తీస్తే కామెడీ అవుతుంది. అలాంటిదే జరిగిందని… తన మనుషుల్ని ఎవరైనా పోలీసులకు పట్టిస్తే… అంతకు మించిన రియాల్టీ షో అవుతుంది. చెవిరెడ్డి ఇప్పుడు అదే చేస్తున్నారు.
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హత్యకు రెక్కీ జరిగిందట..!. ఈ విషయాన్ని పోలీసులు కనిపెట్టలేదు. నేరుగా.. చెవిరెడ్డే… స్వయంగా దర్యాప్తు చేసి .. విషయాన్ని కనిపెట్టి .. ఇద్దర్ని పట్టుకుని పోలీసుల వద్దకు తీసుకొచ్చారు. వాళ్లిద్దర్నీ బొక్కలో వేసి అర్జంట్‌గా… చంద్రగిరి టీడీపీ ఇన్చార్జ్ పులివర్తి నాని మీద.. కుట్ర కేసు పెట్టాల్సిందేనని తేల్చారు. ఇంతకీ.. చెవిరెడ్డి తెచ్చిన వాళ్లిద్దరూ ఎవరంటే… ఆయన దగ్గర పని చేస్తున్న డ్రైవర్లట. మరి చెవిరెడ్డి డ్రైవర్లేమిటి..? ఆయనపై రెక్కీ చేయడం ఏమిటి…? అనే డౌట్స్ అందరికీ వస్తాయి కదా..! దానికి ఆయన జబర్దస్త్ స్కిట్ టైప్‌లో ఓస్టోరీ అల్లేశారు. అందులో “స్కిట్” కూడా ఉంది. ఓ ఆడియో కూడా .. రిలీజ్ చేసేసారు.
చంద్రగరి నియోజకవర్గంలో పసుపు – కుంకుమ, పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో.. రగడ జరిగింది. మహిళలు… చెవిరెడ్డిని తీవ్రంగా కొట్టారని ప్రచారం జరిగింది. ఆ దెబ్బకు ఆయన ఆస్పత్రి పాలయ్యారు. కోలుకున్న తర్వాత.. అది తనపై జరిగిన హత్యాయత్నంగా ఆయనకు అనిపించింది. వెంటనే తన వద్ద ఇద్దరు డ్రైవర్లను పిలిచి మాట్లాడారు. దాన్ని సీక్రెట్‌గా రికార్డు చేశారు. వాళ్లు బుద్దిగా.. ” మేమిద్దరం టీడీపీ నేత పులివర్తి నాని మనుషులం. పోకిరి టైపులో… అండర్ కవర్ ఆపరేషన్ చేయడానికి వచ్చాం. మాకు చెరో పదినేను లక్షలిస్తారు. మా పని.. చెవిరెడ్డి ఎక్కడికి వెళ్తున్నారో వాళ్లకు చేరవేయడం..” అని ముందుగా ప్రాక్టీస్ చేసుకొచ్చినట్లుగా చెప్పారు. వెంటనే చెవిరెడ్డి వారిని తీసుకుని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి.. వాళ్లిద్దరిని అప్పగించి పులివర్తి నాని మీద ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా.. ఇలాంటి సీన్లు తాము బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చూశామని.. గుర్తు చేసుకుని ఉంటారు..!