ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న వారిని నిశితంగా పరిశీలిస్తాడు. వారిని చేరదీస్తాడు. చివరికి వారు మరో రకంగా చనిపోతూ ఉంటారు. చివరికి తేలే విషయం ఏమిటంటే .. వారిని చేరదీసే వ్యక్తి వారి పేరుపై పెద్ద ఎత్తున ఇన్సూరెన్స్‌లు చేసి… సరైన సమయంలో చంపేసి.. క్లెయిమ్‌లు చేసుకుంటూ ఉంటాడు. ఇది ఫ్లాపైన ఓ సినిమాలోని కథ. సినిమా ఫ్లాపేమో కానీ.. కథ..కథలోని ప్లాట్ బాగా నచ్చిందనుకున్నారేమో కానీ.. నల్లగొండ జిల్లాలోని ఓ ముఠా దీన్నే అమలు చేసేసింది. ఐదారుగుర్ని చంపేసి… రూ. కోట్లు క్లెయిమ్ చేసుకుని దొరికిపోయింది. ఇప్పుడీ వ్యవహారం సంచలనాత్మకం అవుతోంది.
నల్లగొండజిల్లాకు చెందిన ఇద్దరు బీమా ఏజెంట్లు, మరో ఇద్దరు కరుడు గట్టిన క్రిమినల్స్ ముఠాగా ఏర్పడ్డారు. వారు మరుమూల ప్రాంతాల్లో అనారోగ్యంతో ఉన్న వారిని గుర్తించి.. వారి కుటుంబసభ్యులను ఒప్పించి బీమాలు చేయించడం ప్రారంభించారు. అలా చేయించడానికి ముందే కుటుంబసభ్యులతో ఒప్పందం చేసుకుంటారు. క్లెయిమ్ చేసే సొమ్ములో ఇరవై శాతం మాత్రమే ఇస్తామని.. మిగతా మొత్తం తమదేనని ఆ ఒప్పందం సారాంశం. అనారోగ్యంతో మృతి చెందేవారికి క్లెయిమ్ రాదు కాబట్టి…చనిపోబోయే వ్యక్తిని చంపేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిద్దామని వారు ఒప్పందం చేసుకుంటారు. డబ్బు కోసం… బీమా చేయించే వ్యక్తి కుటుంబసభ్యులు కూడా అంగీకరించడంతో వారు ప్లాన్ అమలుచేస్తారు.
ఇలామొత్తంగా ఖమ్మం, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో ఐదారుగుర్ని చంపేసి బీమా క్లెయిమ్ చేసుకున్నారు. ఈ ప్రక్రియ మొత్తంలో ఎవరికీ అనుమానం రాకుండా.. బీమా కంపెనీ సిబ్బందితో పాటు బ్యాంకు వారిని కూడా మచ్చిక చేసుకున్నారు. వారికి తృణమో.. పణమో అప్పచెప్పారు. అందరూ కలిసి ముఠాగా ఏర్పడి ఈ దందాకు తెరలేపారు. అంతా సాఫీగాసాగిపోతుందని అనుకుంటున్న సమయంలో… ఓ హత్య విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోటిరెడ్డి అనే వ్యక్తిని హతమార్చి ట్రాక్టర్ ప్రమాదం కింద చిత్రీకరించాలనిఅనుకున్నారు. కానీ పోస్టుమార్టంలో కోటిరెడ్డికి బలమైన గాయాలున్నట్లుగా తేలడంతో పోలీసులు విచారణ జరిపిచారు. చివరికి తీగలాగడంతో… బీమా ఏజెంట్ గురించి బయటకు వచ్చింది. దీంతో కథ అంతా వెలుగులోకి వచ్చింది.
అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఎప్పటికైనా చనిపోతాడు కాబట్టి అతన్ని ముందే చంపేసి బీమా క్లెయిమ్ చేసుకోవడం ఈ ముఠా పని. డబ్బు కోసం మానవ సంబంధాలు విడిచిపెట్టిన కుటుంబసభ్యులది కూడా ఇందులో నేరమే. డబ్బులే పరమావధి అవుతున్న సమాజంలో.. ఇలాంటి దారుణాలు ఇంకెన్ని వెలుగులోకి వస్తాయో..!