బీహార్‌కు చెందిన కేంద్ర మంత్రుల ఇళ్లలో రెండు వారాల వ్యవధిలో రెండు సార్లు కాల్పుల ఘటనలు జరిగాయి. రెండు ఘటనల్లోనూ కుటుంబసభ్యులే ఒకరినొకరు కాల్చి చంపుకున్నారు.
బీహార్ మాజీ సీఎం, ప్రస్తుత కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలిని ఆమె భర్త ఇంట్లోనే కాల్చి చంపాడు. గయా జిల్లాలోని ఓ గ్రామంలో వీరు నివాసం ఉంటారు. లోకల్ మేడ్ నాటు తుపాకీతో భార్యను కాల్చి చంపిన భర్త వెంటనే పరారమయ్యాడు. ఈ ఘటన కలకలం రేపింది. మార్చి నెల మూడో వారంలో సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న నిత్యానందరాయ్ ఇంట్లోనూ కాల్పులు జరిగాయి. ఆయన కూడా బీహార్ కు చెందిన నేతే. ఆయన ఇంట్లో మంచి నీళ్ల విషయంలో గొడవలు జరగడంతో ఆయన మేనళ్లుళ్లు కాల్పులు జరుపుకున్నారు. ఇందులో ఓ మేనల్లుడు చనిపోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కేంద్ర మంత్రి సోదరి కూడా బుల్లెట్ గాయాలకు గురయ్యారు.
బీహార్‌లో కేంద్ర మంత్రుల కుటుంబాల్లోనే ఇలా ఉందంటే ఇక శాంతిభద్రతల పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెబ్ సిరీస్‌లో చూపించినట్లుగా నాటు తుపాకుల తయారీని కుటీర పరిశ్రమలుగా పెట్టుకుని వాటిని విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారు. ఈ తుపాకులతో క్షణికావేశంలో కొందరు..దోపిడీల కోసం కొందరు నేరాలకు పాల్పడుతున్నారు.