విశాఖపట్నంలోని ప్రఖ్యాత యూనివర్శిటీ గీతం గోడ కూల్చిన ఘటన ఏపీ ప్రజలకు ఇప్పటికీ గుర్తుండి ఉంటుంది. ఓ పది జేసీబీలో తెల్లవారుజామునే విరుచుకుపడి.. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని గోడను కూల్చేశారు. ఆ తర్వాత భవనాలు కూడా ప్రభుత్వ భూముల్లోనే ఉన్నాయని కూల్చేస్తామని సాక్షి మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. తర్వాత సైలెంట్ అయ్యారు. అయితే ఈ మధ్యలో ఏం జరిగింది అంటే.. గీతం వర్శిటీ యజమానుల నుంచి ఆరు ఎకరాలు.. విజయసాయిరెడ్డి కూతురు, అల్లుడి నుంచి బదిలీ అయ్యాయి.
విశాఖలో వైసీపీ నేతల భూ దందాలు, కబ్జాలపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గట్టి పోరాటం చేస్తున్నారు. ఆధారాలతో సహా ఈ విషయాన్ని వెల్లడించారు. గీతం వర్శిటీ అధినేత భరత్ బాబాయ్ భరద్వాజ్ కు చెందిన ఆరు ఎకరాల స్థలం.. ఆ గోడ కూల్చిన ఘటన తరవాత .. విజయసాయిరెడ్డి అల్లుడు, కూతురు పేరు మీద ఉన్న కంపెనీకి మారిపోయింది. ఆ డాక్యుమెంట్లను కూడా ఆయన ప్రదర్శించారు. గీతం అంటే… టీడీపీ ముఖ్యులది. టీడీపీ అధినేత బంధువులది. అంతటి వారినే కూల్చివేతల పేరుతో బెదిరించి ఆస్తులు రాయించుకున్నారంటే.. ఇక సామాన్యుల్ని ఎలా వదిలేస్తారన్నది మూర్తి యాదవ్ ప్రశ్న.
వైసీపీ నేతల భూదందాలు.. కూల్చివేతల వెనుక ఖచ్చితంగా కుట్ర ఉందని.. ప్రజల ఆస్తుల్ని అడ్డగోలుగా తక్కువ ధరకు రాయించుకునే భయంకరమైన కుట్ర.. అధికార స్థాయిలో జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన నేత మూర్తి యాదవ్ ఈ విషయంలో చేస్తున్న పోరాటం అందర్నీ ఆకర్షిస్తోంది.