మురుగదాస్ మామూలు దర్శకుడు కాదు. గజినీతో సంచలనం సృష్టించాడు. గజనీ ఓ హాలీవుడ్ సినిమాకి స్ఫూర్తి అయినప్పటికీ ఆ కథని సౌత్ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా మలిచిన విధానం నిజంగానే ఆశ్చర్యపరుస్తుంది. అదే సినిమాని బాలీవుడ్ లో రిమేక్ చేసి ఇండియన్ సినిమాలో తొలి 100 కోట్ల సినిమా అందించిన దర్శకుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. తర్వాత కొన్ని విజయాల్ని అందించాడు.
మురుగదాస్ ఒక సినిమా చేస్తున్నాడు అంటే కచ్చితంగా ఏదో ఒక క్రియేటివ్ ఎలిమెంట్ ఉంటుందని, టేకింగ్ మేకింగ్ ఉన్నత స్థాయిలో ఉంటాయనే నమ్మకం. అయితే లేటెస్ట్ గా సల్మాన్ ఖాన్ తో తీసిన సికందర్ సినిమా చూశాకా అసలు ఈ సినిమా తీసింది మురుగదాసేనా? అనే అనుమానం రాకమానదు. ఎందుకంటే సినిమాలో ఒక్కటంటే ఒక్కటి కూడా అబ్బురపరిచే సన్నివేశం ఉండదు. ఎంతసేపు ఒక సీరియల్ షూట్ చేస్తున్నట్టుగా సినిమాని చుట్టేసాడు. ఒక్క సీన్ స్టేజింగ్ లో కానీ, సీన్ కట్టింగ్ లో గాని ఎక్కడ కూడా మురుగదాస్ మార్క్ కనిపించదు. స్క్రీన్ ప్లే అయితే మరి నీరసంగా తయారైయింది.
ఇప్పుడు మురుగదాస్ చేతిలో ఒకే ఒక సినిమా ఉంది. అదే శివ కార్తికేయన్ మదరాసి. ఈ సినిమాతోనే మురగదాస్ మళ్లీ నిరూపించుకోవాలి. లేదంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో తను మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడం చాలా కష్టంతో కూడుకున్న పని. కాకపొతే ఈ సినిమా మీద మంచి నమ్మకాలే ఉన్నాయి. ముఖ్యంగా శివ కార్తికేయన్ స్క్రిప్ట్ సెలక్షన్ మీద మార్కెట్ లో ఓ కాన్ఫిడెన్స్ వుంది. మదరాసిలో ఏదో ఒక విశేషం ఉంటుందనే ఓ పాజిటివ్ వైబ్ వుంది. మురుగ ఈ సినిమాతోనైనా మురిపిస్తాడేమో చూడాలి.