బడా హీరోల సినిమాల వరకూ వచ్చేసరికి సంగీత దర్శకుల దగ్గర పెద్దగా ఆప్షన్లు దొరకడం లేదు. అయితే దేవిశ్రీ ప్రసాద్, లేదంటే తమన్ అన్నట్టు తయారైంది పరిస్థితి. అనిరుధ్ ఉన్నాడు కానీ, తన ఫ్లేవర్ వేరు. అన్ని కథలకూ అనిరుధ్ సూట్ కాడు. ఊర మాస్ సినిమాలు, పక్కా కమర్షియల్ మీటర్ లో సాగే కథలు అనిరుధ్ అస్సలు చేయడు. జీవి ప్రకాష్ సంగీతం కూడా పెద్ద సినిమాలకు సెట్ కాదు. అందుకే మ్యూజిక్ దగ్గర పేచీ వస్తోంది. ఉన్నవాళ్లతో సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
అయితే ఆ తరవాత భీమ్స్ మంచి ఆప్షన్ కాగలడన్న భరోసా టాలీవుడ్ కు కలుగుతోంది. ‘ధమాకా’ సినిమాతో అదిరిపోయే సంగీతాన్ని అందించాడు భీమ్స్. ఈ సినిమా విజయంలో పాటలది కీలక పాత్ర. భీమ్స్కి మాస్ పల్స్ బాగా తెలుసన్న విషయం ధమాకాతో రుజువైంది. ఆ తరవాత ‘MAD’ రూపంలో మరో హిట్టు పడింది. అందులో పాటలన్నీ బాగా వైరల్ అయ్యాయి. ‘MAD 2’లో కూడా పాటలు బాగా వచ్చాయని టాక్. లడ్డూ గాని పెళ్లి పాట ఇప్పటికే బయటకు వచ్చేసింది. ఈ పాటకు మంచి స్పందన వస్తోంది.
ఈ సంక్రాంతికి విడుదల కానున్న సినిమాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఒకటి. వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబోలో రూపుదిద్దుకొన్న సినిమా ఇది. ఇందులో 4 పాటలు ఉన్నాయి. అందులో రెండు బయటకు వచ్చాయి. ఆ రెండూ ఇన్స్టెంట్ హిట్లే. ముఖ్యంగా రమణగోగుల పాడిన పాట చాట్ బస్టర్ హిట్ గా నిలిచిపోయింది. ఈ హిట్ తో భీమ్స్ బిగ్ లీగ్ లోకి చేరిపోయినట్టే. మాస్, కమర్షియల్ సినిమాలకు తను మంచి ఆప్షన్ కాగలడు. మరీ ముఖ్యంగా భీమ్స్ ఉన్నాడంటే ఆడియో కంపెనీలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. చిరంజీవి, బాలయ్య, నాగ్, రవితేజ… ఈ జోన్ హీరోలకు భీమ్స్ సంగీతం అందివ్వగలడు. కమర్షియల్ గానూ సంక్రాంతికి వస్తున్నాం హిట్ కొడితే.. మన దర్శకులకు దేవి, తమన్ తరవాత ఇంకో ఆప్షన్ దొరికినట్టే అనుకోవాలి.