ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కేబినెట్ లోకి ముస్లిం మంత్రిని తీసుకోవాలని నిర్ణయించారు. 28వ తేదీలోపు ఎప్పుడైనా ఆయన ముస్లిం ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీతో ప్రమాణస్వీకారం చేయిస్తారని తెలుగుదేశం పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. 28వ తేదీ న తెలుగుదేశం పార్టీ గుంటూరులో మైనారిటీ సదస్సు నిర్వహిస్తోంది. కేంద్రంలో బీజేపీతో కటీఫ్ చెప్పేసిన తర్వాత..ముస్లిం వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. హజ్ యాత్రకు వెళ్లే ముందు తన వద్దకు వచ్చిన ముస్లింలతో.. చంద్రబాబు ఇదే మాట చెప్పారు. ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వబోతున్న సూచనలు ఇచ్చారు.
ముస్లింలను మంత్రివర్గంలోకి తీసుకుంటానని ముఖ్యమంత్రి ఇప్పటికే రెండు, మూడు సార్లు ప్రకటించారు. అప్పటి నుంచి పశ్చిమగోదావరి జిల్లాకు ఎమ్మెల్సీ షరీఫ్ పేరు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఆయన ఎప్పటి నుండో పార్టకి విధేంగా ఉంటున్నారు. కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా పేరు కూడా ప్రచారంలోకి వచ్చినా.. ఆయన ఫిరాయింపు ఎమ్మెల్యే. గవర్నర్ వైపు నుంచి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై హైకోర్టులో పిల్ విచారణలో ఉంది. ఈ ఇబ్బందులెందుకని… టీడీపీ ఎమ్మెల్సీకే చాన్సివ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు.
టీడీపీలోని మరో వర్గం చంద్రబాబు ముందు కొత్త డిమాండ్ పెట్టింది. రాయలసీమ ముస్లింలకు చాన్సివ్వాలనదే ఆ వాదన,.ఎమ్మెల్సీగా ఫరూక్ శాసనమండలి ఛైర్మన్ గా ఉన్నారు. కానీ ఇది కొత్త సమస్యలకు దారి తీస్తుందని భావిస్తున్నారు. శాసనమండలి చైర్మన్ గా ఫరూక్ ను కొనసాగించి, షరీఫ్ ను క్యాబినేట్ లోకి తీసుకుంటే ఇరువురు ముస్లిం నేతలకు అత్యున్నత పదవులు కట్టబెట్టినట్లవుతుందని టీడీపీ వర్గాలు బావిస్తున్నాయి. మంత్రి వర్గంలో ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలుపుకుని 24మంది మంత్రులు ఉన్నారు. బీజేప మంత్రులు రాజీనామాలు చేయడంతో రెండు ఖాళీలు ఉన్నాయి. ఈ రెండింటిని భర్తీ చేస్తారా.. లేదా ఒక్కదానితో సరి పెడతారా అన్న ఆసక్తి కూడా టీడీపీ వర్గాల్లో ప్రారంభమయింది.