పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇతర పార్టీల నుంచి ఫక్తు రాజకీయ నేతలను చేర్చుకునే విషయంలో కాస్త ఆలస్యం చేస్తున్నప్పటికీ, వ్యూహాత్మక చేరిక లను మాత్రం కొనసాగిస్తున్నాడు పవన్ కళ్యాణ్. జనసేన ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ , తన కుమారులు జనసేన పార్టీలో చేరినట్లు వెల్లడిచేసింది జనసేన పార్టీ. మీడియా రంగంలో అపార అనుభవం కలిగిన ఈ కుటుంబం చేరిక జనసేన పార్టీకి కలిసివస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ముత్తా గోపాలకృష్ణ , ఆంధ్రప్రభ
ముత్తా గోపాలకృష్ణ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నేత. 1983-89, 1994-99, 2004 లో ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా, మంత్రిగా కూడా పనిచేశారు. పలు బిజినెస్ లతో పాటు ఈయన ఆధ్వర్యంలో ఉన్న వాసవి కమ్యూనికేషన్స్ మీడియా రంగంలో బలమైన ముద్ర వేసింది. ఆంధ్రప్రభ పత్రికను ఈయన సొంతం చేసుకోవడమే కాకుండా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక లో వాటా కూడా కలిగి ఉన్నాడు. అపార రాజకీయ అనుభవం కలిగిన ముత్తా గోపాలకృష్ణ ను పార్టీలోకి రావాల్సిందిగా స్వయంగా పవన్ కళ్యాణ్ ఆహ్వానించాడని, దానికి ఆయన సమ్మతించారని జనసేన పార్టీ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. అలాగే , పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ లో ముత్తా గోపాలకృష్ణ గారికి స్థానం కల్పిస్తామని అదే ప్రకటన పేర్కొంది
ముత్తా శశిధర్, గౌతం , ఇండియా అహెడ్ ఇంగ్లీషు న్యూస్ ఛానల్, @రిపబ్లిక్ న్యూస్ తెలుగు చానల్
ఇక ఈయన కుమారులు శశిధర్, గౌతం లు కూడా రాజకీయంగా యాక్టివ్ గా ఉండడమే కాకుండా మీడియా రంగం లోను కొత్త వెంచర్లు ప్రారంభించబోతున్నారు. గౌతమ్ త్వరలో “ఇండియా అహెడ్” అనే ఇంగ్లీషు న్యూస్ ఛానల్ ప్రారంభించనున్నారు. గతంలో తెలిపినట్లుగా ఈ ఛానల్ లో పవన్ కళ్యాణ్ ఒక షో చేయబోతున్నారు. సామాజిక సమస్యలపై రూపొందనున్న ఆ ప్రోగ్రాం అమీర్‌ఖాన్ చేసిన సత్యమేవ జయతే తరహాలో ఉండనుంది. ( https://www.telugu360.com/te/pawan-kalyan-program-on-social-issues-in-national-channel/ ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కి సంబంధించిన, పలు ప్రజా సమస్యలను ఈ షో ద్వారా వెలుగులోకి తీసుకు రావడమే కాకుండా, నిపుణులు మేధావులతో చర్చలు జరిపి ఆయా సమస్యలకు పరిష్కార మార్గాలను కూడా కనుగొనే ప్రయత్నం ఈ ప్రోగ్రాం ద్వారా చేయనున్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయడమే కాకుండా, జనసేన పార్టీ ఉనికిని జాతీయ స్థాయిలో చాటే ఉద్దేశ్యం కూడా ఈ ఛానల్ కి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ తో పాటు “@రిపబ్లిక్ న్యూస్” అనే తెలుగు చానల్ కూడా వీరి ఆధ్వర్యంలోనే ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
సామాజిక వర్గ సమీకరణం
వైశ్య సామాజిక వర్గానికి చెందిన కొద్దిమంది రాజకీయ నాయకుల లో ముత్తా గోపాలకృష్ణ ఒకరు. రాజకీయ రంగం తోపాటు పత్రికాధిపతి గా ఉండడం వల్ల ఈయనకు ఆ సామాజిక వర్గం లో మంచి పేరుంది. అయితే 2009లో కాంగ్రెస్ పార్టీ ఈయనకు టికెట్ నిరాకరించింది. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ఈయన స్థానంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహిత మిత్రుడైన ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనే మరొక అభ్యర్థికి టికెట్ కేటాయించాడు. దీంతో ముత్తా గోపాలకృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాల్సి వచ్చింది. అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడిన చంద్రశేఖర రెడ్డి ఆ ఎన్నికలలో విజయం సాధించాడు.
మీడియా మద్దతు విషయంలో మరో ముందడుగు
పవన్ కళ్యాణ్ మీద ఆ మధ్య కొన్ని న్యూస్ చానెళ్లు కొంతమందిని అడ్డంపెట్టుకుని వ్యక్తిగత దాడి చేయడం, ఆ తర్వాత పవన్‌కళ్యాణ్ రివర్స్‌లో మీడియా మీద దాడి చేయడం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని ఛానళ్లు పవన్‌కళ్యాణ్ న్యూస్ ని డౌన్ ప్లే చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే జనసేన సెక్రెటరీ తోట చంద్రశేఖర్ 99టీవీ ని చేజిక్కించుకుని జనసేన అభిమానులకు సమాచారం అందేలా చేస్తున్నారు. ఇక 10 టీవీ త్వరలోనే జనసేనకు పూర్తి అనుకూలంగా మారనుందని, నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా జనసేన వర్గాలు ఆ చానల్ ని చేజిక్కించుకున్నాయని తెలుస్తోంది. అలాగే ఇటీవల పవన్ కళ్యాణ్ “శతఘ్ని” అనే పక్ష పత్రికను కూడా పార్టీ తరపున ప్రారంభించాడు. ఇప్పుడు ఆంధ్రప్రభ పత్రిక కూడా వీటికి తోడయితే కచ్చితంగా ఆ ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. ఇక ఇండియన్ అహెడ్ న్యూస్ ఛానల్, @రిపబ్లిక్ న్యూస్ ఛానల్ ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి.
ఎన్నికలకు ఇంకా కేవలం 8 నెలలే సమయం ఉంది కాబట్టి ఈ ఛానల్ ల ప్రభావం ఎంతవరకూ ఉంటుందనేది కొంతమందికి సందేహంగా ఉన్నప్పటికీ, గతంలో ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు అప్పటిదాకా ఉన్న అంచనాలు తారుమారు కావడం చాలాసార్లు చూశాం. కాబట్టి ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ కి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది వేచి చూడాల్సిన అంశం.
-జురాన్ (@CriticZuran)