ఇప్పుడు మీడియా మొత్తం ఏదో ఒక పార్టీకి కొమ్ము కాసే ధోరణిలోనే ఉన్నాయన్న మాట చేదు వాస్తవం. పత్రికలు లేదా టీవీ ఛానళ్ల యాజమాన్యాలు వాస్తవాలను తమకు అనుకూలంగా అభివర్ణిస్తూ తమకు అవసరం ఉన్న , అనుబంధం ఉన్న రాజకీయ పార్టీల వ్యూ పాయింట్లోంచి పాఠకులకు , ప్రేక్షకులకు అందించడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. కొన్ని పార్టీలు సొంతంగా పత్రికలనే నడుపుకుంటూ ఉండడం కూడా రివాజుగా మారింది. తెరాసకు, వైఎస్సార్ కాంగ్రెసుకు పత్రిక, ఛానెల్ అధికారికంగానే ఉన్నాయి. అయితే మీడియా బలాన్ని గుర్తెరిగిన వైకాపా అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి మరికొన్ని టీవీ ఛానెళ్లలో కూడా పెట్టుబడులు పెట్టి.. లేదా, వారితో సత్సంబంధాలు కొనసాగిస్తూ.. వారిద్వారా కూడా తనకు అనుకూల ప్రచారం చేయించుకుంటున్నారనే మాట కూడా తరచుగా వినిపిస్తూ ఉంటుంది.
ఈ నేపథ్యంలో జగన్ అమ్ముల పొదిలో, ఆయన అనుకూల ప్రచారం నిర్వహించే మీడియా సంస్థల జాబితాలో మరో పత్రిక పెరగనుంది. ఆంధ్రప్రభ డైలీ యజమాని, పబ్లిషర్ ముత్తా గోపాలకృష్ణ బుధవారం వైకాపాలో చేరబోతున్నారు. బుధవారం నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడలో యువభేరిని నిర్వహించబోతోంది. ప్రత్యేక హోదా ద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం అనే విషయంపై యువతలో చైతన్యం కలిగించడానికి ఈ భారీ సదస్సును ఏర్పాటు చేస్తున్నారు.
ఈ సభలోనే కాకినాడకు చెందిన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ముత్తాగోపాలకృష్ణ వైకాపాలో చేరబోతున్నారు. ఆయన ఆంధ్రప్రభ దినపత్రిక యజమాని కూడా. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కన్నబాబు కూడా వైకాపాలో చేరుతున్నారు. తొలుత ప్రజారాజ్యం ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జర్నలిస్టు కురసాల కన్నబాబు తర్వాత చిరంజీవితో పాటు కాంగ్రెస్లో చేరి, గత ఎన్నికల్లో మాత్రం పార్టీని వీడి ఇండిపెండెంటుగా బరిలోకి దిగారు. రెండోస్థానంలో నిలిచి మాజీ అయిన ఆయన ఇప్పుడు వైకాపా తీర్థం పుచ్చుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వీరి చేరిక వల్ల పార్టీకి బలం పెరగడం సంగతి ఎలా ఉన్నా.. వైకాపాకు అనుకూల ప్రచారం చేయడానికి ఓ పత్రిక పెరగడం గ్యారంటీ అని పలువురు అనుకుంటున్నారు.