ఆదివారం సాక్షి పత్రికలో విశాఖలో ఎంవీవీ సత్యనారాయణ కు చెందిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన వచ్చింది. అది కూడా చిన్న స్థాయిలో కాదు. రెండు ఫుల్ పేజీల యాడ్స్. కనీసం ఐదు కోట్ల రూపాయలు ఖర్చయి ఉంటుంది. గతంలో ఇలాంటి ఫుల్ పేజీల యాడ్స్ ఎప్పుడూ ఎంవీవీ కంపెనీ నుంచి పత్రికలకు రాలేదు. కానీ సాక్షికి.. మాత్రమే.. అదీ కూడా కిడ్నాప్ వ్యవహారం అంతా తేలిపోయిన తర్వాత ప్రకటనలు వేయడమే ఆశ్చర్యకరంగా విశాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
భూమి యజమానులకు ఒక్కటంటే ఒక్క శాతం ఇచ్చి మిగతా 99 శాతం బిల్డర్ అయిన ఎంవీవీ సత్యనారాయణ తీసుకునేలా ఓ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం కడుతున్న ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటనే ఇచ్చారు. ఆ ఒప్పందం గురించి గతంలో విజయసాయిరెడ్డి వివరాలు బయట పెట్టారు. ఇప్పుడుదాని గురించి ప్రకటనలు ఇస్తున్నారు. ఎంవీవీ సత్యనారాయణ వైసీపీ ఎంపీనే కావొచ్చు కానీ.. ఆయన చేసేది వ్యాపారం .. తాను ప్రకటనలు ఇవ్వాలనుకుంటే.. ఒక్క సాక్షి చదివే వారికి తెలిస్తే సరిపోతుందని అనుకోరు. అందిరికీ తెలియాలనుకుంటారు. కానీ ఎందుకో సాక్షికి మాత్రమ ఇచ్చారు.
విశాఖలో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఎవరూ ఊహించనివి జరుగుతున్నాయన్న వాదన మాత్రం గట్టిగ వినిపిస్తోంది. ఎవరూ తప్పించుకోలేరని.. దానికి .. ఎంవీవీ ఉదంతమే సాక్ష్యమని చెప్పుకోవడం ప్రారంభించారు. కారణం ఏదైనా ఎంవీవీ సోమవారం సీఎం జగన్ ను కలవబోతున్నారు. ఆదివారం రెండు ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. దీంతో ఇక ఈ కేసు వ్యవహారం సద్దుమణిగిపోతుందన్న అభిప్రాయం మాత్రం గట్టిగా వినిపిస్తోంది.