జగన్ ను నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చిన ఎంవీవీ పరువే కాదు సర్వం కోల్పోయే పరిస్థితికి వచ్చారు. జగన్ రెడ్డికి కప్పం కట్టి ఎంవీవీ పీక్ అనే ప్రాజెక్టును విశాఖలో ప్రారంభించారు. హైరైజ్ అపార్టుమెంట్లు కడుతున్న ఈ స్థలం వివాదంలో ఉంది. నిబంధనలు పాటించలేదు. ఈ విషయంలో ప్రభుత్వం మారగానే ఆయనకు స్టాప్ వర్క్ ఆర్డర్ వచ్చేసింది . దీంతో ఆయన కిందా మీదా పడుతున్నారు.
ఎంవీవీ భార్య, కుమారుడ్ని కిడ్నాప్ చేసిన ఘటనలో నిజాలేంటో ఇంకా బయటకు రాలేదు. కానీ అది కిడ్నాప్ కాదని.. సెటిల్మెంట్ అన్న ఆరోపణలు ఉన్నాయి. అదంతా ఈ ఎంవీవీ పీక్ ప్రాజెక్టుకు సంబంధించిన స్థలానిదేనని జనసేన నేత మూర్తి యాదవ్ లాంటి వారు చాలా రోజులుగా ఆరోపిస్తున్నారు. కిడ్నాప్ ఘటన తర్వాత జగన్ ను కలిసిన ఎంవీవీ సత్యనారాయణ తర్వాత సాక్షికి.. మాత్రమే.. అదీ కూడా కిడ్నాప్ వ్యవహారం అంతా తేలిపోయిన తర్వాత ప్రకటనలు ఇచ్చారు.
ఎంవీవీ పీక్ ప్రాజెక్ట్ భూమి యజమానులకు ఒక్కటంటే ఒక్క శాతం ఇచ్చి మిగతా 99 శాతం బిల్డర్ అయిన ఎంవీవీ సత్యనారాయణ తీసుకునేలా ఓ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం కడుతున్న ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటనలే సాక్షిలో ఇచ్చారు. ఆ ఒప్పందం గురించి గతంలో విజయసాయిరెడ్డి వివరాలు బయట పెట్టారు. తర్వాత దానికి రెండు ఫుల్ పేజీ ప్రకటనలతో సెటిల్మెంట్ అయింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మళ్లీ స్టాప్ వర్క్ ఆర్డర్ వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ఎంవీవీ చాలా నష్టపోతున్నారు.
కొసమెరుపేమిటంటే ఈ సారి అసెంబ్లీకి పోటీ చేసి 80 కోట్లు ఖర్చు పెట్టి 70 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అదీ కూడా ఆయనకు గట్టి దెబ్బకొట్టినట్లే.