నిన్న ఒక సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యధికంగా నేరస్తులకు టికెట్ ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ సీపీ అంటూ వ్యాఖ్యలు చేశారు. టికెట్లు ప్రకటించేటప్పుడు ఒకవైపేమో ఉద్దండరాయునిపాలెం లో అరటి తోటలు తగలబెట్టిన కేసులో నిందితుడైన సురేష్ నీ, మరొకవైపు కన్నెధార గ్రానైట్ కొండలు తవ్వేసిన నిందితుడు ధర్మాన ని జగన్ కూర్చోబెట్టుకున్నారు అని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే జగన్ ప్రకటించిన లిస్టు ను పరిశీలించిన కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి.
విశాఖపట్నం ఎంపీ టికెట్ ను జగన్ టాలీవుడ్ నిర్మాత ఎంవి.సత్యనారాయణ కేటాయించారు. ఈయన గీతాంజలి , లక్కున్నోడు తదితర చిత్రాలను నిర్మించారు. అయితే ఈయన విశాఖపట్నంలో లో క్రికెట్ స్టేడియం ఎదురుగా 2016లో గేటెడ్ కమ్యూనిటీ నిర్మించ తలపెట్టారు. అక్కడ ఉన్న 88 ప్లాట్లలో 38 ఫ్లాట్లను కొనుగోలు చేశారు. 357/1 , 357/2 సర్వే నంబర్లు గల ఆ ఫ్లాట్లలో ఆయన గేటెడ్ కమ్యూనిటీ లాంచ్ చేసినప్పుడు హోర్డింగ్ల లో మాత్రం తాను కొన్న 38 ప్లాట్ లతోపాటు వాటి పక్కన ఉన్న ప్లాట్ లు కూడా ఆ గేటెడ్ కమ్యూనిటీల లోకి వస్తాయి అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా సమాచారాన్ని ఏర్పాటు చేశారు. దీంతో భయభ్రాంతులకు లోనైన పక్క ప్లాట్ల యజమానులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అప్పట్లో పోలీసులు ఆయనను అరెస్టు కూడా చేశారు. అయితే, తెలుగుదేశం పార్టీ నేత కళావెంకట్రావు ఉద్దేశపూర్వకంగానే తనను అరెస్టు చేయించాడు అని సత్యనారాయణ అప్పట్లో ఆరోపణలు చేశారు.
ఏది ఏమైనా ఇప్పుడు జగన్ ఈయనకు ఏకంగా విశాఖ ఎంపీ టికెట్ ఇవ్వడంతో విశాఖ వాసులు ఆశ్చర్యపోతున్నారు.