అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో ‘మై డియర్ దొంగ’ సినిమా ఆహా ఓటీటీలోకి వచ్చింది. షాలిని కొండెపూడి హీరోయిన్ గా నటించడంతో పాటుగా ఈ కథని కూడా ఆమెనే అందించారు. మరి ఈ కథలోని కొత్తదనం ఏమిటి? ఈ దొంగ కథ ప్రేక్షకులని హత్తుకునేలా ఉందా?
సుజాత (షాలిని కొండెపూడి) ఓ డేటింగ్ యాప్ లో కాపీ రైటర్. లవ్, రిలేషన్షిప్స్ పై కొటేషన్స్ రాస్తుంటుంది. విశాల్ (నిఖిల్ గాజుల)తో రెండేళ్ళుగా రిలేషన్ షిప్లో వుంటుంది. సురేష్ (అభినవ్ గోమఠం) ఓ విచిత్రమైన దొంగ. కేవలం గ్రాసరీ సరుకులు కోసమే పెద్ద పెద్ద గేటెడ్ కమ్యునిటీస్ లో దొంగతనాలు చేస్తుంటాడు. అనుకోకుండా ఓ రోజు సుజాత ఇంట్లో దొంగతనానికి వచ్చి ఆమెకు దొరికిపోతాడు. సురేష్ ని చూసిన సుజాత మొదట భయపడుతుంది. తర్వాత అతని గురించి తెలిసి మెల్లమెల్లగా మాట కలుపుతుంది. ఈ ఇద్దరి కుటుంబ నేపధ్యాలు ఒకేలా వుండటంతో సురేష్‌పై తనకు ఇష్టం ఏర్పడుతుంది. తర్వాత ఏం జరిగింది? విశాల్ తో సుజాతకు వున్న రిలేషన్ సురేష్ రాకతో ఎలా మారింది? ఇదంతా తక్కిన కథ.
ఓటీటీలు వచ్చిన తర్వాత లైటర్ వెయిన్ కథల సంఖ్య పెరిగింది. మై డియర్ దొంగ కూడా ఫన్ టచ్ వున్న ఓ సింపుల్ కథే. అయితే ఇలాంటి సింపుల్ కథని ప్రేక్షకులని హత్తుకునేలా చెప్పడానికి నేర్పు కావాలి. ఆ నేర్పు మై డియర్ దొంగలో కనిపించలేదు. ఇందులో ఫన్ పండలేదు, కథ కూడా గాడితప్పుతూ ఒక డైరెక్షన్ అంటూ లేకుండా ఏటేటో తిరుగుతూ చివరికి ‘ఇంతేనా’ అనే భావన కలిగిస్తుంది. సన్నివేశాల అల్లికే సినిమా. సినిమాకి ప్రాణం సన్నివేశాలే. మై డియర్ దొంగలో అసలు సన్నివేశాలే లేవు. ఎంతసేపూ కేవలం మాటలతోనే లాగించే ప్రయత్నం జరిగింది. నిడివితో సంబంధం లేకుండా ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా సాగదీసిన వైనం చిరాకు తెప్పిస్తుంది.
ఈ సినిమాకి టైటిల్ పెట్టడంలోనే ఒక తప్పు జరిగింది. ఇది దొంగ (సురేష్) కథ కాదు. సుజాత కథ. ఆమె గతం, తండ్రితో తనకి వున్న అనుబంధం, విశాల్ తో ప్రేమలో ఎదురుకుంటున్న సంఘర్షణ.. రిలేషన్ షిప్ పై తన ఆలోచనలు, వ్యక్తిగత అభిప్రాయాలని చూపే కథ. ఆమె కథలో సురేష్ పాత్ర ప్రవేశం తర్వాత వచ్చిన మార్పులు చూపించే ప్రయత్నం అంతగా రిజిస్టర్ కాలేదు. ఆమె ఎమోషన్స్ ప్రేక్షకుడు కథలో లీనం అయ్యేలా చేయలేకపోయాయి. దీంతో స్క్రీన్ పై జరుగుతున్న తతంగం ఒక గమ్యం లేకుండా సాగుతుంటుంది. దీంతో పాటు సురేష్ పాత్రని కూడా పైపైనే డిజైన్ చేశారు. ఆ పాత్ర మాటలకు తప్పితే సీన్స్ లో పని చేయలేదు.
అభినవ్ గోమఠం మంచి కామెడీ టైమింగ్ వున్న నటుడు. అయితే ఇందులో ఆయనకి చేప్పుకోదగ్గ సన్నివేశాలు పడలేదు. ఆ పాత్ర కూడా అంతగా కనెక్ట్ కాలేదు. ప్రీ క్లైమాక్స్ లో ఆ పాత్ర అజాపజా లేకుండా పోతుంది. ఇది పూర్తిగా రైటింగ్ లోని బలహీనతే. షాలిని కొండెపూడి తన పాత్రని మాత్రం చలాకీగా రాసుకుంది. వసపిట్టలా మాట్లాడే పాత్రది. తన స్క్రీన్ ప్రజెన్స్ ఆ పాత్రకు సరిపోయింది. దివ్య శ్రీ పాద మంచి నటి. ఇందులో మాత్రం తన పాత్ర క్లూలెస్ గా వుంటుంది. అదే వెరైటీ అనుకోవాలి. నిఖిల్ గాజుల తో పాటు మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.
బడ్జెట్ పరిమితులు చాలానే కనిపిస్తాయి. కథ అనుకున్నాక బడ్జెట్ వేస్తారు. కానీ ఈ మధ్య బడ్జెట్ కి సరిపోయే కథలు రాస్తున్నారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఇలానే అనిపిస్తుంది. ఒక ఇల్లు, రోడ్, బార్ .. ఈ మూడు లోకేషన్స్ లో కథని చుట్టేశారు. ఇంట్లో నడిపిన బర్త్ డే పార్టీ అయితే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కంటే పేలవమైన తీరుతో నడుస్తుంది. కొన్ని మాటలు బావున్నాయి. కొన్ని చోట్ల అస్సలు ఆకట్టుకునే మాటలు పడలేదు. ఎడిటింగ్ లో పదును లేదు. నేపధ్య సంగీతం ఓకే అనిపిస్తుంది.
అభినవ్ గోమఠంకు వీర ఫ్యాన్ అయిపోయి, ఆయన తెరపై కనిపిస్తే చాలు అనుకొనేవాళ్లూ, విపరీతమైన సహజం, ఓపిక ఉండి 2 గంటలు పెద్దగా సమయం కాదనుకొనేవాళ్లూ.. తప్పకుండా చూడొచ్చు.