వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేసే సరికి… కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అసలు సూత్రధారాలు, పాత్రధారులు ఎవరో పోలీసులు కనిపెట్టినట్లు… ఎలాంటి లోపాలు లేకుండా కేసును డీల్ చేసేందుకు మరిన్ని వివరాల కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో వైఎస్ కుటుంబం… సీబీఐ విచారణ కోసం.. తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. నేరుగా హైకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ విచారణకు రాలేదు. ఇప్పుడు నేరుగా వైఎస్ వివేకా కుమార్తెనే రంగంలోకి దిగారు. తొలి రోజు.. పులివెందులలో ప్రెస్ మీట్ పెట్టి.. సిట్ విచారణపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆమె… ఒక్క రోజుకే.. మనసు మార్చుకున్నారు. అమరావతికి వచ్చి ఈసీకి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు విచారణను ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ.. సీబీఐకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కానీ.. తమ చేతుల్లో లేదని చెప్పడంతో.. ఆమే నేరుగా ఢిల్లీ వెళ్లారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. అక్కడ కూడా అదే సమాధానం వచ్చింది.
దాంతో.. ఆమె కేంద్ర హోంశాఖ దగ్గరకు వెళ్లారు. దీనిపై.. ఇప్పటికే హైకోర్టులో కేసు వేశారు కాబట్టి.. ఆ తీర్పు వచ్చిన తర్వాత చూద్దామని వారు కూడా చెప్పి పంపించారు. హత్యకేసు విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరామని.. అయితే కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఎప్పటికప్పుడు, డీజీపీ, సీఎం చంద్రబాబుకు వివరాలు ఇస్తున్నారని ఆరోపించారు. రాజకీయంగా మా నాన్న హత్యను వాడుకోవాలని చూస్తున్నారన్నారంటున్నారు. మా అన్న జగన్ మీద కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. మా కుటుంబ సభ్యులనే ఇరికిస్తారన్న అనుమానాలు కలుగుతున్నాయి. మా అన్నే నాన్నను చంపారన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారుని ఆమె ఆరోపించారు. ఈ అంశంపై మా అమ్మ విజయవాడ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారని వ్యాఖ్యానించారు.
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కావాలని జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ.. దానికి విచారణ అర్హత లేదన్న వాదన వినిపిస్తోంది. వైఎస్ వివేకా భార్య లేదా కూతురు మాత్రమే పిటిషన్ వేయాల్సి ఉంది. అందుకే.. ఇప్పుడు.. వైఎస్ వివేకా భార్యతో పిటిషన్ వేయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. సిట్ విచారణపై… సునీత సంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత.. ఎందుకు మాట మార్చుతున్నారనేది ఆసక్తికరంగా మారింది. కేసులో కొత్త కొత్త పేర్లు బయటకు వచ్చే కొద్దీ.. బంధువులపైనే అనుమానాలు పెరుగుతూండటంతో… సీబీఐ విచారణకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.