బుల్లితెర మీద పలు రకాల ప్రోగ్రామ్స్ తో ముందు అలరించినా ఆ తర్వాత అపవాదాలు ఎదుర్కున్న ఓంకార్ సడెన్ గా దర్శకుడిగా మారి ‘జీనియస్’ అనే సినిమా తీశాడు. చిన్నికృష్ణ కథ అందించిన ఆ సినిమా మంచి పాయింటే అయినా మొదటి సినిమా కాబట్టి సరిగా డీల్ చేయలేక డీలా పడ్డాడు. ఆ సినిమా చేసిన టైంలో ఇంకా బుల్లితెర ప్రోగ్రామ్స్ చేసేప్పుడు కూడా తనని బాగా అభిమానించే వారని.. అభిమానించే వారు ఎంతమంది ఉన్నారో అంతకు రెండింతలు తనను విమర్శించిన వారున్నారని అన్నాడు ఓంకార్.
తన యాంకరింగ్ మీద చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారని అది విని వారికి సమాధానం చెప్పదలచుకున్నానని అన్నాడు ఓంకార్. ప్రస్తుతం రాజు గారి గది సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఓంకార్.. సినిమా సక్సెస్ తో ఒక్కసారిగా టాలీవుడ్ కు షాక్ ఇచ్చాడు. కేవలం కోటిన్నర బడ్జెట్ తో రూపొందించబడ్డ ఈ సినిమా ఇప్పటికే పెట్టిన డబ్బంతా వచ్చి మంచి లాభాలను తెచ్చి పెడుతుందట.
సినిమా కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ లాభాల పంట పడిస్తుందట ఓంకార్ తెరకెక్కించిన రాజు గారి గది. ఈ సినిమా సక్సెస్ పట్ల ఎంతో సంతృప్తి చెందిన దర్శకుడు ఓంకార్ ఈ సినిమా నన్ను విమర్శించి, అవహేళన చేసిన వారికి అంకితం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం సక్సెస్ మజాను ఎంజాయ్ చేస్తున్న ఓంకార్ తన తర్వాత సినిమా ఓ పెద్ద బ్యానర్లో చేస్తున్నాడని వినికిడి. మరి ఆ ప్రాజెక్ట్ కు సంబందించిన డీటేల్స్ త్వరలో తెలిసే చాన్స్ ఉంది.