మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా చర్చకు దారితీశాయి. హైడ్రా విషయంలో అమాయకులను రెచ్చగొట్టి రోడ్డుమీదకు లాగుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావుపై విమర్శలు గుప్పించిన ఆయన..ఈ ఎపిసోడ్ లోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినీ లాగారు. మంగళవారం గజ్వేల్ లో మల్లన్నసాగర్ భూనిర్వాసితుల్ని పరామర్శించి మైనంపల్లి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు బైఠాయిస్తానని మైనంపల్లి హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం చేపట్టిన భూసేకరణలో భాగంగా ఎంతోమంది భూములు కోల్పోయారు. ఈ అంశంపై మైనంపల్లి స్పందిస్తూ హరీష్ రావునూ టార్గెట్ చేశారు.
ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు నుంచి హరీష్ రావు భూములను తప్పించారని, రెండు రోజుల్లో తాను హరీష్ రావు భూములను పరిశీలిస్తానని చెప్పారు. ఈ విషయంలో అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆందోళన చేపడుతానని హెచ్చరించడం చర్చనీయంశంగా మారింది.
ఇక, మూసీ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని…బీఆర్ఎస్ వాళ్లు రెచ్చగొడితే రెచ్చిపోవద్దన్నారు. బాధితులను ఆదుకునేందుకు తనతోపాటు తన భార్య ఆస్తిని రాసిస్తానని, కేటీఆర్, హరీష్ రావులు కూడా వారి ఆస్తిని బాధితులకు రాసి ఇచ్చేందుకు రెడీనా అంటూ సవాల్ చేశారు.