రాజకీయాల్లో ఉన్నప్పుడు కాస్తంత హుందాతనం ఉండాలి. ఎంత రాజకీయ ప్రత్యర్థి అయినా సరే రాజకీయంగా విబేధించవచ్చు కానీ.. వ్యక్తిగతంగా, కుటుంబాల జోలికి వెళ్లకూడదు. కానీ కొంత మంది మాత్రం ఇలాంటి గీతల్ని అసలు పట్టించుకోరు. ఇతరుల్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టేస్తూ ఉంటారు. రాజకీయాల్లోకి కుటుంబాలను తీసుకు వస్తూ ఉంటారు. ఇలాంటివారిలో ఇప్పుడు మైనంపల్లి రోహిత్,ధర్మపురి అరవింద్ జంట కవులుగా మారిపోయారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు.
మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. తండ్రి మైనంపల్లి హన్మంతరావు పలుకుబడితో ఎమ్మెల్యేగా మెదక్ నుంచి గెలిచారు. పాతికేళ్లు నిండగానే ఆయనకు అవకాశం వచ్చింది. హుందాగా రాజకీయాలు చేయాల్సిన అయన..కేసీఆర్ పైనే విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు.ల వాడు , వీడు అంటూ దుర్భాషలాడుతున్నారు. ఆయన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కేసీఆర్ వయసు ఎంత.. రాజకీయాల్లో ఆయన అనుభవం ఎంత.. ఈ రోహిత్ వయసు ఎంత అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎన్ని విమర్శలు వస్తున్నా ఆయన మాత్రం తన దారిలో తాను వెళ్తున్నారు.
ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కేసీఆర్ కుటుంబాన్నే టార్గెట్ చేస్తున్నారు. అందరూ కలిసి కేసీఆర్ ను చంపేస్తారన్న భయంతోనే ఆయన పోయి ఫామ్ హౌస్ లో ఉంటున్నారన్న విచిత్రమైన లాజిక్కులు చెబుతూంటారు. కవిత, కేటీఆర్ లకూ అపాయింట్ మెంట్ కావాలని ..లేకపోతే కలవరని తానేదో వెళ్లి చూసినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి గాసిప్పులను ప్రచారంలో పెట్టి ఆ కుటుంబంలో ఏదో గొడవలు ఉన్నాయని అందరికీ తెలిసేలా చేయడమే అర్వింద్ టార్గెట్. కానీ కుటుంబాన్ని ఇలా రాజకీయాలకు వాడటం సరైనది కాదని ఆయన అనుకోవడం లేదు.
వీరిని తిట్టి బీఆర్ఎస్ నేతలు వారికి పబ్లిసిటీ ఇవ్వాలనుకోవడం లేదు. ఎమ్మెల్యే రోహిత్ కు కౌంటర్ ఇచ్చినా పెద్దగా చేసినట్లేనని అనుకుంటున్నారు. అరవింద్ కు జిల్లా స్థాయి నేతలు బదులు చెబుతున్నారు. కానీ రాజకీయాల్లో ఇలా మాట్లాడటాన్ని ప్రజలు హర్షించకపోవచ్చు.