గత కొన్ని నెలలుగా ఎం.వి.మైసూరా రెడ్డి వైకాపాకి దూరంగా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయనకి జగన్మోహన్ రెడ్డి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కనపెట్టినందుకే పార్టీకి దూరం అయ్యేరని తెలుస్తోంది. ఆ సంగతి జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసినప్పటికీ ఆయన పట్టించుకోలేదంటే ఆయనను వదిలించుకోవడానికే చూస్తున్నారని భావించక తప్పదు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈమధ్య కడపలో పర్యటిస్తున్నప్పుడు మైసూరా రెడ్డి ఊరిలోనే ఉన్నప్పటికీ వెళ్లి కలవలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనను కలవాలని ప్రయత్నించలేదు.
ఇకపై తనను వైకాపా నేతగా పేర్కొనవద్దని మైసూరా రెడ్డి మీడియా ప్రతినిధులను కోరినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పార్టీని వీడనని మరి కొన్ని రోజులు లేదా వచ్చే ఎన్నికల వరకు వేచి చూసి తగిన నిర్ణయం తీసుకొంటానని మీడియా ప్రతినిధులకు ఆయన చెప్పారు. తెదేపాలో చేరుతారని మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ, ఆ పార్టీ నుండి ఇంతవరకు ఆహ్వానం రాకపోవడంతో ఆ వార్తలను ఆయన ఖండించారు. తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకొంటానని చెప్పారు.