జగన్మోహన్ రెడ్డితో విభేదించి వైకాపాకి దూరం అయిన ఎంవి మైసూరారెడ్డి రాయలసీమకే పరిమితంగా ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. రాష్ట్ర విభజన కారణంగా చాలా మంది కాంగ్రెస్ నేతల రాజకీయ భవిష్యత్ అయోమయంగా మారింది. వారిలో కొందరు రాజకీయాలకి పూర్తిగా దూరమవగా మరికొందరు ముద్రగడ వంటివారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. రాయలసీమలో కూడా అటువంటి చాలా మంది రాజకీయ నిరుద్యోగులున్నారు. తెదేపా, వైకాపాలలో కూడా అసంతృప్తితో ఉన్న నేతలున్నారు. వారందరితో కలిసి సీమకే పరిమితమైన రాజకీయ పార్టీ పెట్టేందుకు మైసూరారెడ్డి అందరితో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నిజానికి జగన్ ప్రోద్బలంతో ఆయన గత ఏడాదే వైకాపాని విడిచిపెట్టి రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలుపెట్టబోతున్నారని, కానీ విమర్శలు వెల్లువెత్తడంతో ఆఖరి నిమిషంలో జగన్ ఆయనకి బ్రేకులు వేయడంతో ఆగిపోయారని మీడియాలో వార్తలు వచ్చేయి. జగన్ తొందరపాటు నిర్ణయాల వలన అనవసరంగా తనకి చెడ్డ పేరు వచ్చిందని అప్పుడు మైసూరా చాలా బాధ పడ్డారని, ఆ కారణంగానే ఆయన వైకాపాకి దూరం అయ్యేరనే ఒక టాక్ ఉంది. అయినప్పటికీ ఆయన పార్టీని వీడక పోవడానికి కారణం రాజ్యసభ సీటుపై ఆశతోనేనని గుసగులు వినిపించాయి. జగన్ దానిని విజయసాయి రెడ్డికి కట్టబెట్టడంతో తీవ్ర నిరాశ చెందిన మైసూరారెడ్డి వేరు కుంపటి పెట్టుకొనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాయలసీమ వెనుకబాటుతనం, పాలకుల నిర్లక్ష్యం, వివక్ష కారణంగా సీమ జిల్లాల ప్రజలలో తీవ్ర అసంతృప్తి, అసహనం నెలకొని ఉన్నాయనే సంగతి సీమ నేతలందరికీ తెలుసు. దానిని ఉపయోగించుకొని రాజకీయంగా ఎదగాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, టిజి వెంకటేష్ వంటివాళ్ళు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. వారిలో టిజి వెంకటేష్ రాజ్యసభ సీటు దక్కడంతో సీమ సమస్యలు పరిష్కారం అయినట్లే భావిస్తూ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మైసూరారెడ్డి వంతు అనుకోవలసి ఉంటుంది. ఆయన కొత్త పార్టీ పెట్టుకొని సీమ సమస్యల పరిష్కారానికి పోరాడాలనుకొంటున్నట్లు తెలుస్తోంది.
ఆయన అంతవరకే పరిమితమయితే ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ తన రాజకీయ జీవితం సుస్థిరం చేసుకోవడానికి వేర్పాటు ఉద్యమం మొదలుపెడితే, సీమప్రజలే ఆయనని తిరస్కరించే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన సీమలోని అన్ని పార్టీల నేతలని ఆకర్షించి కొత్త పార్టీ స్థాపించి దానిని నిలబెట్టగలిగితే, దాని నుంచి తెదేపా, వైకాపాలకి సవాలు ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక ఆ రెండు పార్టీలు ఆయన ప్రయత్నాలకి మొదటిలోనే బ్రేకులు వేసేందుకు తెర వెనుక ప్రయత్నించవచ్చు. అయినా రాజకీయాల నుంచి రిటైర్ అవవలసిన సమయంలో ఆయన కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టడం మంచి నిర్ణయం కాదని చెప్పవచ్చు. అంతకంటే తనవంటి నేతలకోసం చూస్తున్న భాజపాలో చేరితే ఆయనకి, భాజపాకి కూడా ప్రయోజనం ఉంటుంది కదా!